3:21
గత శాశ్వతత్వం నుండి
శాశ్వతత్వం వైపు ప్రవహించే వెలుగుల నది
మానవ పరంపర
3:22
వర్ణ రహిత ద్రవంలో వసించే ఆత్మలకు
మానవుడి వేదన చూసి ఈర్ష్య పుట్టదా?
3:23
“పవిత్ర నగరానికి దారి నిజంగా ఇదేనా!?”
అని నాకు తారసపడిన తైర్థికుడిని అడిగాను.
“నాతోరా!
ఒక్కరోజులో నిన్నక్కడికి చేరుస్తాను” అన్నాడతను.
రోజుల తరబడి నడిచినా మేము గమ్యం చేరలేదు. ఆశ్చర్యమేమంటే...
నన్ను దారి తప్పించినందుకు
అతడే నామీద కోపగించాడు.
3:24
భగవాన్... నన్నొక సింహానికి ఆహారంగా వెయ్యి లేదా నాకొక కుందేలును ఆహారంగా ఇవ్వు
3:25
చీకటి దారిని తప్పించి
వేకువ నెవ్వడూ చేరలేడు
3:26
“నీ గతం ఇక్కడే నివాసముంది,
నన్నువదలకు” అంటుంది నాయిల్లు.
“రా, నన్ననుసరించు,
నేను నీ భవిష్యత్తును” అంటుంది రహదారి.
నాకు గతం లేదు, భవిష్యత్తూ లేదు
నేనిక్కడ నిలిస్తే ఆ నిలకడలో గమనముంది
నేనక్కడికి గమిస్తే ఆ గమనంలో నిలకడుంది
ప్రేమ, మరణం మాత్రమే అన్నిట్నీ
మారుస్తాయి
3:27
జీవన న్యాయం మీద నమ్మకమెలా పోతుంది? కటికనేలపై శయనించేవాడికంటే
హంసతూలికా తల్పంపై నిద్రించేవాడు
అందమైన కలలేమీ కనడం లేదు కదా!
3:28
విచిత్రమేమిటంటే ...
కొన్ని సుఖాల పట్ల నాకున్న వాంఛే
నా బాధలలో ఒక భాగమౌతోంది.
3:29
పరిపూర్ణ సత్యం గురించి నాకేమీ తెలియదు
నా అజ్ఞానం ముందు నేను వినయంగా ఉంటాను అందులోనే
నాకు గౌరవ పురస్కారాలు
లభిస్తాయనుకుంటాను
3:30
స్వప్నానికీ సాఫల్యతకీ మధ్య అంతరముంటుంది.
మనిషి యొక్క తీవ్రమైన తపన దానిని తుడిచేస్తుంది.