నేలనాదని ప్రకటించుకోవడం
మనకెప్పటికీ జన్మహక్కే.
ఒక జెండాను వొడిసి పట్టుకుని
గుండెల్లో నింపుకున్న విశ్వాసం పైకెగరేసి
శవాలను కాళ్లతో ముద్దాడుతూ
నడుస్తూ ఆ రక్తసిక్త మరణ నగరాల మీద,
ఆచంద్రతారర్క అత్యవసరం
ఆ నేల నాదని,
ఖచ్చితంగా ప్రకటించుకోవవడం.
మనం పోరాటాన్ని హత్తుకుందాం
ఈ రోజు చచ్చైనా సరే
రేపటి వాడి శవాన్ని కలగందాం
పిల్లల శరీరాలను పణంగా పెట్టైనా సరే.
నేల మనకెప్పటికి ముఖ్యం
వేల జీవితాలదేముంది
మళ్లీ మళ్లీ
పుట్టుకొస్తునే వుంటాయ్.
ఏడుపులు పాత పడతాయ్,
చచ్చిన కళేబరాలు కొత్తనేలవుతాయ్.
పాత భూముల మీద కంబళ్లు పరుస్తాయ్.
నీకో రహస్య తెలుసా
మనకి చంపడం, చావడం ఒక సరదా
దానికి నేలను ఎరగా వేస్తాం.
వున్నది వున్నట్టు వుంచక పోవడం
ఒక నిత్యానందం
దానికి జీవితాలనైనా వదిలేస్తాం.
రెండు చేతుల్లోకి ఎత్తుకుని
ఒక ఆత్మీయ విగతదేహాన్ని
దాని గుండెల్లో తలదాచుకుని విలపిద్దాం.
నేల ఎప్పటికి దుఃఖించదు
నీలా లేదా నాలా.