1
చాలాసార్లు
చిరాకనిపిస్తుంది,
తాళింపులోకి కూరలా,
ఒక్కో నిజానికి, కొన్ని
అబద్దాలను
అలవోకగా
కలుపుతున్నప్పుడు.
2
కొన్ని సార్లు మనసు తెల్లబోతుంది,
లోపలంతంత పెట్టుకొని,
ఎదుటోడే ప్రపంచమన్నట్లు
ముఖానికి ఓ ముసుగు
తగిలించుకొని,
అదేపనిగా
ముచ్చట్లాడుతున్నప్పుడు.
3
ఎప్పుడైన
విచిత్రమనిపిస్తుంది
పిసురంత ఆపేక్షకు
తట్టుకోలేక
దేన్నో పగలుగొట్టుకొని
మాటల ప్రవాహం
దూకినప్పుడో,
కనురెప్పల కింద, ఓ
పల్చటి కన్నీటి తెర
రెపరెపలాడుతున్నప్పుడో
,.
4
అప్పుడప్పుడు
అబ్బురమనిపిస్తుంది
మనసు లోతుల్లోకి వేసిన
గాలానికి,
ఎప్పుడెప్పుడో
జారిపోయిన భావాలు కొన్ని,
అనుకోకుండా గుత్తులుగా
తగులుకున్నప్పుడో,
నా ప్రమేయం
లేకుండానే,పేపరు తీరానికి,
ఏ మూలలనుంచో,
అప్రయత్నంగా,
కొన్ని వాక్యాలు
కొట్టుకొస్తున్నప్పుడో..
వాకిలి ఈ-సాహిత్య పత్రికలో అచ్చయిన కవిత,..
ఇంకొన్ని కవితలు చదవాలనుకుంటే,.ఈ లింక్ లోకి వెళ్లండి,.
చాలా బాగా వ్రాశారు భాస్కర్ గారు
ReplyDeleteశ్రీకాంత్ గారు, మీ అభిమాన పూర్వక వ్యాఖ్య కి ధన్యవాదాలండి,.
Deleteఏది ఏమైనా సాగించక తప్పదు కదా ఈ పయనం....Good one Bhaskar garu.
ReplyDeleteపద్మార్పిత గారు ధన్యవాదాలండి,.అంతే కదండి మరి,.పయనం సాగాల్సిందే,.అలా,..
Delete