Pages

15 February 2013

ఒక అనువాదం





ఎందుకని విలపిస్తారు,

నేను లేని, నా సమాధి ప్రక్కన నిలబడి,

మరణించని, నన్ను తలచుకొని, మిత్రులారా,..


నేనున్నాను ప్రతి గుండెలో, ప్రతి ఇంటిలో





నేనున్నాను, నా స్వప్న కాశ్మీరంలో,





మీకు వినిపిస్తుందా, నా స్వరం,.





వేల గొంతుకలలో ప్రతిధ్వనిస్తూ,.





..

ఆంగ్ల మూలం : ప్రియదర్శిని . ఢిల్లీ JNU 

Do not stond in my grave and cry



Iam not ther!



I did not die!


Iam in my country-kashmir



iam in every house, in every heart.



!
Hear my voice in their slogans.... 

7 February 2013

సమైఖ్యత Vsఅనైక్యత




1
పెటేల్మని పాంజియా పగలకపోతే,
ఖండాలకి రూపుండేదా ?
ఈ జగతికి కళ వుండేదా ?
సమైఖ్యతని ఏడ్చేవారో,
అనైఖ్యతని అరిచేవారో,
ఎవరూ లేని ఆది కాలమది,.

2
రోడ్డెమ్మట నడిచేవానికి,
ప్రతిక్షణానికి దిక్కుమారదు,
నడిసంద్రంలో ఈదేవానికి,
భూభాగాలా జాడే దొరకదు,.

ఓపికలేక అద్ధం పగిలితే,
ఎవడి ముక్కలో వాడి ముఖాలే,
ఎన్ని వదిలినా,.కొన్ని కలిపినా
కష్టం – కనుమరుగై పోదు,.
రాజ్యం - రమణీయం కాదు,.

3
సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే,.
కూలిన గోడల దేశన్నొకటి మొన్ననే చూశామే,.

ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా,.
గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా,.

అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా,.
నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా,.

బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా,.
గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా,.

విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు,

4
ఏ స్వార్థంతో లూరేషియా ముక్కలైపోయిందో,
ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగసాయో,.

ఎత్తులు, పై ఎత్తులలో
అరువుబతుకులా ఆకలుండదు,
ఆకలే లేని రోజున,
అమరణ దీక్షకు విలువ వుండదు.

గందరగోళపు వ్యాఖ్యానాలు,
ఉత్తకూతలా ప్రేలాపనలు,.
జగడం ప్రాణసంకటం,. నిబద్దతే ప్రశ్నార్థకం,.

5
జీడిపాకమై సాగే కథలో,
చివరి మలుపులో ఏముందో,.
రెండు పిల్లులా కలహపు కధలో
లబ్ధిపొందినా కోతేదో,.

విడిపోయే రోజొకటొస్తే,
ఆనందంగా విడిపోదాం \ విద్వేషంతో కొట్టుకుచద్దాం
కలిసుండటమే తప్పనిసరైతే
అన్నదమ్ములుగా జీవిద్దాం \ రాష్ట్రం రావణకాష్టం.

రాజ్యలక్ష్మికి మనసు వుండదు,
కష్టజీవికి రాజ్యముండదు,.
కరుకు గుండెలో కవితలుండవు,.
కవులకలాలకు కుట్రతెలియదు,..,.
 --------------------------------------------------------



పాంజియా - 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి, దాన్ని పాంజియా

అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది, అవి గోడ్వానాలాండ్, లూరేషియా ,

..50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా ఆసియా ప్రాంతాన్ని 

డీ కొట్లడం వలన హిమలయాలు ఏర్పడాయి ( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం)

3 February 2013

ప్రమేయాలు



1
చాలాసార్లు చిరాకనిపిస్తుంది,
తాళింపులోకి కూరలా,
ఒక్కో నిజానికి, కొన్ని అబద్దాలను
అలవోకగా కలుపుతున్నప్పుడు.

2
కొన్ని సార్లు మనసు తెల్లబోతుంది,
లోపలంతంత పెట్టుకొని,
ఎదుటోడే ప్రపంచమన్నట్లు
ముఖానికి ఓ ముసుగు తగిలించుకొని,
అదేపనిగా ముచ్చట్లాడుతున్నప్పుడు.

3
ఎప్పుడైన విచిత్రమనిపిస్తుంది
పిసురంత ఆపేక్షకు తట్టుకోలేక
దేన్నో పగలుగొట్టుకొని
మాటల ప్రవాహం దూకినప్పుడో,
కనురెప్పల కింద, ఓ పల్చటి కన్నీటి తెర
రెపరెపలాడుతున్నప్పుడో ,.

4
అప్పుడప్పుడు అబ్బురమనిపిస్తుంది
మనసు లోతుల్లోకి వేసిన గాలానికి,
ఎప్పుడెప్పుడో జారిపోయిన భావాలు కొన్ని,
అనుకోకుండా గుత్తులుగా తగులుకున్నప్పుడో,
నా ప్రమేయం లేకుండానే,పేపరు తీరానికి,
ఏ మూలలనుంచో, అప్రయత్నంగా,
కొన్ని వాక్యాలు కొట్టుకొస్తున్నప్పుడో..


వాకిలి ఈ-సాహిత్య పత్రికలో అచ్చయిన కవిత,.. 
ఇంకొన్ని కవితలు చదవాలనుకుంటే,.ఈ లింక్ లోకి వెళ్లండి,.