బేకారీలు ఈ పేరు కేవలం తిట్టుగానో, ఆక్షేపణగానో వినడంనుంచి ఆ పేరు ఒక తాత్విక సంవాదానికి కేంద్రమైన కవిత్వానికి చిరునామాగా చెప్పిన సహజకవి భాస్కర్.కె గారి బేకారీలు ‘‘ఆమె’’ పేరుతో ఒక పుస్తకం రూపంలో వెలువడ్డాయి. ఆముచ్చట్లు మీతో కొన్ని పంచుకుంటాను.
******
వృత్తిరీత్యా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా తనదైన ముద్రతో విద్యార్ధులను తీర్చిదిద్దుతూనే మరోపక్క చరిత్రకారుడిగా ఫోటో గ్రాఫర్ గా మరీ ముఖ్యంగా తన విలక్షణ తాత్త్వికతను అందమైన అల్లికలో అందించే కవిగా పదాడంబరాలో, ఢాంబికాలో లేని సహజత్వంతో తనను తాను వెలిబుచ్చుకోవడంలో విభిన్నమైన వ్యక్తి భాస్కర్. సరళంగానే కాదు ఒక్కోసారి ఏమీ ఎరగని వాడిలా ఉండే తనని అర్ధం చేసుకోవాలంటే మరోసారి ఎంతో క్లిష్టంగా కూడా అనిపిస్తుంది. తీరా చూస్తే ఆ క్లిష్టత తనలో కాక చూసే మన దృష్టికోణంలోని సాంప్రదాకతదేమో అని మరింకోసారి రుజువవుతుంటుంది. అలాటిదొక ఉదాహరణ చెప్తాను.
******
నిన్న తెల్లవారు జామున రెండున్నరకు హైదరాబాదునుంచి ఖమ్మం చేరగానే తన కొత్తపుస్తకం చేతిలో పెట్టారు. కవర్ పేజీ అబ్ స్ట్రాక్ట్ పెయింట్ లా అపిపిస్తోంది. ఎడిటర్లుగా మృత్యుంజయరావుగారు. శ్రీసుధామోదుగు గారు వున్నారు కదా వారిద్దరూ ఏం ఆలోచించారా అని చూస్తున్నాను. పుస్తకం పేరు "ఆమె" అన్నారు కదా అని ఎడమ వైపు తిరిగిన హిప్పోకాంపస్ నిండు చూలాలి గుండ్రని పొట్టాలా వుంది కవర్ పేజీ అనుకుంటున్నాను. హిప్పో కాంపస్ మెదడు లోని ఒక భాగం మాత్రమే కాదు ఒకరకం జీవి పేరు కూడా. ప్రపంచాన్ని మోసే "ఆమె" అంటున్నారా? ఆలోచనలను మోసే "ఆమె" అంటున్నారా? ఆలోచిస్తూ ఎందుకులే ఎదురుగా వున్నారని భాస్కర్ నే అడిగాను. ఎప్పటిలా ఒక సరళమైన చిరునవ్వు నవ్వుతూ తను చెప్పాడు. అర్ధం కాలేదా ఒకసారి పుస్తకాన్ని అడ్డంగా తిప్పిచూడండి. మామూలుగా కన్ను కనిపిస్తుంది. "దృష్టికోణం" అనేదే నా వుద్దేశ్యం. పుస్తకంలో చెప్పదలచుకున్నది అదే కదా అని పెట్టాను. ఏం బాగాలేదా? ఓ నాలుగు కవర్లలో మృత్యుంజయరావుగారు ఇది బావుందన్నారు నేను సరేనన్నాను అంటూ ఆలోచనల్లోనూ మాటల్లోనూ ఏ బరువూ లేకుండా తను చెప్తుంటే అనిపించింది. చివర్లో తన కవిత్వంలోని ఆవిడ మాట్లాడితే ఇలాగే అంటుందేమో. ‘‘ తన కవిత్వాన్ని అర్దం చేసుకునేప్పుడూ అంతే కదా. లోతైన విషయాన్న తను ఎంతో సరళంగా,సాదాగా చెప్తుంటే. దాన్ని మరింత ఇష్టంగానైనా క్లిష్టంగా అర్దంచేసుకుంటూ కష్టపడతా0 ’’.
******
బేకారీ అంటే నిర్వ్యాపారత, నిరుద్యోగము, పనికిమాలినతనము అని వ్యర్థం, నిరుపయోగం అనీ అర్ధాలున్నాయి. ఈ తాత్త్విక సంవాదం లో కూడా ఏదో ఒక సిద్దాంతానికో విధానానికో కట్టుబడిన పట్టుబడిన ఆలోచనకాక అలవోకగా జీవితంలో ఎదురయ్యే వేర్వేరు సంఘటనలను అచ్చంగా కొత్తగా చూడటం వాటిపై అప్పటికే సాంప్రదాయ బద్దంగా ఇచ్చిన వివరణలను పునః సమీక్షించడం వాద ప్రతివాదాలకు సమన్వయంగా సమవాదం వినిపించినట్లు ఒక్కోసారి ఒక ముగింపు ప్రతిపాదన వుండటం మరోసారి ప్రశ్ననే ముగింపుగా వదిలేయడం గమనిస్తాం. నిజానికి భారతీయ తాత్త్వికతలో సంవాదరూప జ్ఞానసముపార్జన ఎప్పటినుంచో వున్నాదే కానీ దానికి కవిత్వ సొబగులు, సంక్షిప్తతా సౌందర్యాన్ని అద్దిన వాడు భాస్కరుడు. మండన మిశ్రుడి కాలం నుంచి పరాంప్రేయసీ (Yasaswi)యశస్వి వరకూ జీవిత సహచరితో ముచ్చట్లను సాహిత్య ప్రక్రియగా మార్చిన నేర్పరులే కానీ జీవితపు తాత్త్వికతలో ఎదురయ్యే అనేక మౌళిక ప్రశ్నలకు ఈ సంభాషణనేపద్యంలో సమాధానాలను వెతికించిన వాడు భాస్కరుడు. తత్త్వమూ కవిత్వమూ అంటే ఎంత కొరుకుడకుండా వుంటాయోమోననే అపప్రదను తొలగిస్తూ అందమైన సింగారపు(శృంగారపు) సందర్భాలను సైతం ఈ నేపద్యానికి అనుభందంగానే సృష్టించగలిగిన వాడు భాస్కరుడు.
******
ప్రేమంటే ముందుకెళ్ళడం
ద్వేషమంటే వెనక్కి మళ్ళడం
అన్నాడతను కాస్తంత తాత్త్వికంగా ముఖం పెట్టి
జీవితమంటే
ముందు వెనకల ఊగిసలాటేనోయ్
అంటుందామె, అలై అల్లుకుంటూ.
మచ్చుకి పైన ఉదహరించిన ఒక కవిత చూడండి ఇప్పటివరకూ సైద్దాంతికంగా భావిస్తున్నదాని ప్రకారం అతడొక విషయం ప్రస్తావించాడు. ప్రేమంటే ఒక పాజిటివ్ అంశం అని ద్వేషించడం అంటే పెద్ద నెగిటివ్ అంశం అని ప్రేమవుండటం అంటే ముందుకు వెళ్ళడం అని ద్వేషం వుంటే వెనక్కి మళ్ళడం అనీ మరికొన్ని పోలికలు సైతం మనం చెప్పుకుంటూనే వుంటాం అదే విషయం అంటాడు అతను. కానీ చాలా సులభంగా ఆవిడ ఈ వాదనకు మరింత పరిపూర్ణత తీసుకు వచ్చింది. ప్రేమ ద్వేషం రెండూ వుండటమే కదా జీవితం అనడాన్ని ముందు వెనకల ఊగిసలాటగా చెప్పేసింది. అయితే భాస్కరుడి చమత్కారం ఆమె అలై అల్లుకుంటూ చెప్పడం వల్ల మరింత కొత్తగా ఆహ్లాదంగా భాసిస్తుంది.
*****
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవితకు దాని పొడవుకు మించిన వివరణ ఇస్తూ మరింత పొడవైన రెన్ అండ్ మార్టిన్ గైడ్ తయారు చెయ్యాలేమో.మీరే స్వయంగా భాస్వర ప్రకాశం చూడాలంటే పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోండి. మంచిపుస్తకం సురేష్ గారు ఇష్టంగా ప్రచురించిన ఈ పుస్తకం కాపీలు ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మంచిపుస్తకం స్టాల్ నంబర్ 84,85 లలో దొరుకుతాయి. ఎక్కడా పేజీలను వృధాపోనివ్వకుండా, అలంకరణలతో ఎడాపెడా నింపకుండా 104 పేజీలలో 280 బేకారీలున్న పుస్తకం ఇది. విషయాన్ని పాఠకులు అర్ధంచేసుకునేందుకు ముందుమాటలూ, వెనకరాతలూ అవసరం లేదనే నిర్ణయంతో అచ్చంగా బేకారీలు మాత్రమే వున్న విభిన్నమైన పుస్తకం వీలయినంత త్వరగా మీ స్వంతం చేసుకోండిమరి. అప్పటిదారా మరికొన్ని బేకారీలు రుచిచూడాలంటే భాస్కర్ కె ఫేస్ బుక్ వాల్ కూడా చూడొచ్చు