వొలికిపోతున్న
ఊపిరిశబ్థాలను
వెచ్చగా
అక్కున చేర్చుకొని
చిరురోమాల
పులకరింతల మధ్య
మరంత
గట్టిగా అదుముకుంటాను
నిన్ను
హృదయపు లోతుల్లలోకి.
ఇక్కడ
భాష శరీరాలది కాదు
అని
చెప్పడానికి సాక్ష్యం లేదు.
అమలిన
ప్రేమభావనల
ఋజువుల
ప్రకటనలకై
ఆరాటం
అసలే లేదు.
ఒక స్పష్టమైన
విభజన రేఖల
ఒప్పంద
పత్రాలపైన సంతకాలు
చేసినట్టే
లేదా చేయనట్టే.
అయోమయం
మొదలైయ్యేది
ఒక
గందరగోళ దృశ్యాన్ని
విప్పి
చూపుకోలేని మనసుల నుంచే.
చెరిగిపోయిన
కలల రాతను
మళ్లీ
రాసుకునేంత మురిపం లేదు.
అసలు
దానికై ఎలాంటి ప్రయత్నం లేదు.
మరి ఇప్పుడు హఠాత్తుగా ఇదేంటని అడిగతే
చెప్పడానికి
సరైన సమాధానమూ లేదు.