Pages

29 December 2014

వాక్య ప్రకటన



కవితా సువార్త
మూడవ అధ్యాయం,పంతొమ్మిదవ వచనం
నా వాక్యం పరాధీన, ఈ లోకం బంధిఖాన.

**
మూకుమ్మడిగా చుట్టిముట్టాయ్
సందేహపు ముఖాలేసుకొని దాడికి సిద్ధమవుతూ
మా పుట్టుకకు కారణమెవరని, నా వాక్యాలు.

బిత్తర చూపుల్ని, తమాయించుకుంటూ
తెల్లపేపరైన ముఖాన్ని మరింత పాలిపోనీకుండా
భావాలను ఎంత బంధించినా,
అయ్యజాడల అస్పష్టతను, ఎరుకపరచలేని అసమర్ధత
అలుముకుంటూనే వుంది, నన్ను.

***
ఏఏ రసాయనాలు కలసి నిర్మిస్తాయో వాక్యాలను
ఏ అచేతన చర్యాఫలమై, వాక్యం నను హత్తుకుందో
ఏఏ అనుభూతులు వాక్యమై ఫ్రతిఫలిస్తాయో
ఏ అదృశ్యాలను వీక్షించిఅంతర్నేత్రాలు
సిద్దపరుస్తాయో నా వాక్యాలను.

***
చెవుల్లో దూరి దూరి,కనుగోళపు గదులు దాటి,
తలకెక్కిన రుచులేవో, ఎగబీల్చన వాసనేదో
స్పర్శ చేత అతుకబడి,ఏది నన్ను సృశిస్తుందో
ఏ జ్ఞానం వెల్లువెత్తి, వాక్యం ఉప్పొంగుతుందో
ఏ బీజం పితరుడై, నా వాక్యం జనిస్తుందో.
***
నా లోపలి, లోలోపలి వేలకోట్ల కణాలెన్నో
మోసుకుంటు తిరుగాడును
ఏ ఆదిమ ముద్రలనో, ముద్రించిన ప్రతులనో
మూలాలకై వెతుకులాట, అలివికాని అన్వేషణ
సొంత గొంతుకనేదొక మిడిజ్ఞానపు మిధ్య కదా.

సారాంశ సమీక్ష అను చివరి ప్రకటన
నా వాక్యం నాది కాదు,
 ఈ దేహం నాది కాదు.
అసలు నేను నేను కాదు

లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు
ప్రతిదీ సంతోషాన్నివ్వలేదు,
దుఃఖానికి హేతువై మిగలాలేదు

Jan 2013
వాక్యం కవితా సంకలనంలో మొదటి కవిత

No comments:

Post a Comment