Pages

30 December 2014

సమ్మె

ఒక ఇష్టమైన భావానికి,స్పష్టమైన ఆకృతినిద్దామని
ఎంత తపనపడ్డా,ఒక్క అక్షరమైనా రూపుదిద్దుకోదేం ?

మనసులోని ఆలోచనల వెల్లువల మొత్తాన్ని
కొత్తగా ప్రతిబింబిద్దామంటే, అందంగా ప్రకటిద్దామంటే
ఏ ఒక్కటీ సహకరించదేం ??

స్పందనల సాగరాన్నియథాతధంగా చిత్రిద్దామంటే
ఎదురు చూడని ధోరణిలో హరివిల్లులా చూపిద్దామంటే
ఎంత వెదికినా, ఏ రంగులూ దొరకవేం ???

Oct 201
వాక్యం కవితా సంకలనంలో రెండో కవిత

29 December 2014

వాక్య ప్రకటన



కవితా సువార్త
మూడవ అధ్యాయం,పంతొమ్మిదవ వచనం
నా వాక్యం పరాధీన, ఈ లోకం బంధిఖాన.

**
మూకుమ్మడిగా చుట్టిముట్టాయ్
సందేహపు ముఖాలేసుకొని దాడికి సిద్ధమవుతూ
మా పుట్టుకకు కారణమెవరని, నా వాక్యాలు.

బిత్తర చూపుల్ని, తమాయించుకుంటూ
తెల్లపేపరైన ముఖాన్ని మరింత పాలిపోనీకుండా
భావాలను ఎంత బంధించినా,
అయ్యజాడల అస్పష్టతను, ఎరుకపరచలేని అసమర్ధత
అలుముకుంటూనే వుంది, నన్ను.

***
ఏఏ రసాయనాలు కలసి నిర్మిస్తాయో వాక్యాలను
ఏ అచేతన చర్యాఫలమై, వాక్యం నను హత్తుకుందో
ఏఏ అనుభూతులు వాక్యమై ఫ్రతిఫలిస్తాయో
ఏ అదృశ్యాలను వీక్షించిఅంతర్నేత్రాలు
సిద్దపరుస్తాయో నా వాక్యాలను.

***
చెవుల్లో దూరి దూరి,కనుగోళపు గదులు దాటి,
తలకెక్కిన రుచులేవో, ఎగబీల్చన వాసనేదో
స్పర్శ చేత అతుకబడి,ఏది నన్ను సృశిస్తుందో
ఏ జ్ఞానం వెల్లువెత్తి, వాక్యం ఉప్పొంగుతుందో
ఏ బీజం పితరుడై, నా వాక్యం జనిస్తుందో.
***
నా లోపలి, లోలోపలి వేలకోట్ల కణాలెన్నో
మోసుకుంటు తిరుగాడును
ఏ ఆదిమ ముద్రలనో, ముద్రించిన ప్రతులనో
మూలాలకై వెతుకులాట, అలివికాని అన్వేషణ
సొంత గొంతుకనేదొక మిడిజ్ఞానపు మిధ్య కదా.

సారాంశ సమీక్ష అను చివరి ప్రకటన
నా వాక్యం నాది కాదు,
 ఈ దేహం నాది కాదు.
అసలు నేను నేను కాదు

లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు
ప్రతిదీ సంతోషాన్నివ్వలేదు,
దుఃఖానికి హేతువై మిగలాలేదు

Jan 2013
వాక్యం కవితా సంకలనంలో మొదటి కవిత

28 December 2014

''వాక్యం" గురించి బొల్లోజు బాబా గారి ఆప్తవాక్యం



వాక్యంకవికి ఒక బాధ్యత
తాను ఎవరికైతే సంపుటి ఇవ్వాలనుకున్నాడో వారి ఛాయ చిత్రాన్ని సంపుటి వెనుక అట్ట పై ముద్రించి యివ్వటం ఎంతో శ్రమ. అట్లాంటి శ్రమ తీసుకున్న ఈ కవిని అభినందిస్తున్నాను---- Rajaram Thumucharla
నా ఫొటో బాక్ కవర్ గా ఉన్న వాక్యంఅనే కవితా సంకలనాన్ని అందుకోగానే ఆశ్చర్యం కలిగింది. ఇదేదో భలే ఉందే అనిపించింది. కవితా సంకలన కర్త శ్రీ భాస్కర్ కొండ్రెడ్డి. వీరు మంచి కవిగా, విశ్లేషకునిగా, సహృదయ పాఠకుడిగా అంతర్జాలంలో అందరికీ పరిచితులే. వీరి కవితలను కవిసంగమంలో అప్పుడప్పుడూ చదువుతూండే నాకు వాటన్నిటినీ మాలగాగుచ్చి పుస్తకరూపంలో అందించారు. అందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు.
ఇక ఈ కవిత్వం గురించి చెప్పాలంటే -- భావాలలో పదును, సంవిధానంలో సరళతా ప్రతీ పద్యానికి మంచి రమ్యత, తాత్వికతలను చేకూర్చాయి. వాక్యం కవితాసంపుటిలో ఏదో ఒక ఇజానికి లోబడి వ్రాసిన కవితలు కనిపించవు. చాలా కవితల్లో అంతస్సూత్రంగా కవిత్వమూ, జీవితమూ పెనవేసుకుపోయి ఉంటాయి. కవిత్వాన్ని జీవితాన్ని విడివిడిగా చూడలేనితనమే మంచి కవిత్వాన్ని సృష్టిస్తుంది. జీవితాన్ని అనుభవించి పలవరించి వ్రాసిన వాక్యాలే కవితలయ్యి పాఠకులను కవి అనుభవాలతో మమేకం చేస్తాయి.
సమాజంలోని వైరుధ్యాలను, వైవిధ్యాలను ఈ కవి చాలా నిశితంగా పరిశీలించి, ఆ అనుభూతుల్ని చక్కని కవితలుగా మలిచాడు. కరుణ, తిరుగుబాటు, నిస్పృహ, ప్రేమ, నమ్మకం, ఆశ, ధిక్కారం, వ్యంగ్యం వంటి అనేక రసాలు చాలా సహజంగా అనేక కవితలలో ఒదిగి మంచి రసస్పందన కలిగిస్తాయి. ఈ సంకలనంలోని కవితలు చదివాకా కొండ్రెడ్డి భాస్కర్ మంచికవే కాక దయగల మానవతా వాది, ఒక సాహితీ సేవకుడు అని అనిపించక మానదు.
ఈ సంకలనంలో నన్ను బాగా కుదిపేసిన కొన్ని కవితా వాక్యాలు

జ్ఞాపకమంటే మనిషిరా!
కొన్నిసార్లు అంతకంటే ఎక్కువేననుకో
స్థిరపరచుకో, ఈ సత్యాన్ని, ఇక ఈ జీవితానికి ---- సత్యావస్థ
మరణానికి ఫలానిది కారణమని
తేలికగా చెప్పేస్తుంటాం
బలమైన ఓ కారణాన్ని
నిజానికి, మృత్యువే సృష్టింస్తుందన్న వాస్తవాన్ని
మనమెప్పటికీ అర్ధం చేసుకోలేం------ మూడు సందిగ్ధాలు
తలవంచుకు బతకాలనే
లొంగుబాటు సిద్దాంతపు
తొలిపాఠం బోధించును
ఉమ్మనీటి తొట్టి నీకు----- బానిసతత్వం
తూట్లుతూట్లు పడినాక కూడ లేచినిలబడేవాడ్ని
ఏ తుపాకి నిలువరిస్తుంది------ లకలకలక
ఈ సంపుటిలో వెక్కిరింత అనే కవిత ప్రయోగదృష్ట్యా అయితే పరవాలేదు కానీ ఎందుకో మిగిలిన కవితల మధ్య అది కలువలమధ్య కొక్కిరాయిలా వెక్కిరిస్తున్నట్లనిపించింది.
గొప్ప అభివ్యక్తి కలిగిన భాస్కర్ కొండ్రెడ్డి భవిష్యత్తులో మరిన్ని మంచి కవితల్ని వెలువరించాలని కోరుకొంటూ .....

భవదీయుడు
బొల్లోజు బాబా

              ధన్యవాదాలు బొల్లోజు బాబా సర్,.