Pages

20 February 2014

సమైక్యత Vsఅనైక్యత



ఫేటేల్మని పాంజియా పగలకపోతే,
ఖండాలకి రూపుండేదా ?
ఈ జగతికి కళ వుండేదా ?
సమైక్యతని ఏడ్చేవారో, అనైక్యతని అరిచేవారో
ఎవరూ లేని ఆది కాలమది.

**
రోడ్డెమ్మట నడిచేవానికి, ప్రతిక్షణానికి దిక్కుమారదు
నడిసంద్రంలో ఈదేవానికి, భూభాగాల జాడే దొరకదు

ఓపికలేక అద్దం పగిలితే, ఎవడి ముక్కలో వాడి ముఖాలే
ఎన్ని వదిలినా, కొన్ని కలిపినా,
కష్టం - కనుమరుగై పోదు
 రాజ్యం - రమణీయం కాదు

**
సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే
కూలిన గోడల దేశాన్నొకటి మొన్ననే చూశామే

ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా ?
గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా ?

అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా ?
నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా ?

బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా ?
గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా ?

విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు.
ఏ స్వార్థంతో లురేషియా ముక్కలైపోయిందో,
ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగశాయో,.

ఎత్తులు, పై ఎత్తులలో - అరువుబతుకులా ఆకలుండదు,
ఆకలే లేని రోజున, ఆమరణ దీక్షకు విలువ వుండదు.

గందరగోళపు వ్యాఖ్యానాలు, ఉత్తకూతల ప్రేలాపనలు
జగడం ప్రాణసంకటం, నిబద్దతే ప్రశ్నార్థకం.

**
జీడిపాకమై సాగే కథలో చివరి మలుపులో ఏముందో
రెండు పిల్లుల కలహపు కథలో లబ్ధిపొందిన కోతేదో

విడిపోయే రోజొకటొస్తే,
ఆనందంగా విడిపోదాం  /  విద్వేషంతో కొట్టుకు చద్దాం
కలిసుండటమే తప్పనిసరైతే
అన్నదమ్ములుగా జీవిద్దాం  రాష్ట్రం రావణకాష్టం.

****
రాజ్యలక్ష్మికి మనసు వుండదు
కష్టజీవికి రాజ్యముండదు.
కరుకు గుండెలో కవితలుండవు
కవుల కలాలకు కుట్రలుండవు.
                                                                                                  Feb 2013



Note:  200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి,
దాన్ని పాంజియా అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది.
 అవి గోడ్వానాలాండ్, లురేషియా.
50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా,
ఆసియా ప్రాంతాన్ని ఢీ కొట్లడం వలన హిమాలయాలు ఏర్పడాయి

( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం)

18 February 2014

కుక్కిరాత


పిల్లలు ఏడుస్తారు, అయితే ఏంటి?
కాసేపయ్యాక తేటగా నవ్వుతారు.

ఆకులు రాలిపోతాయ్,. అయితే ఏంటి?
కాలం గడిచాక, చిగురాకులు పుట్టుకొస్తాయ్.

కుక్కలు మొరుగుతుంటాయ్, అయితే ఏంటి?
కొద్దిసేపటి తరువాత, గొంతలసి
మూలన మునగదీసుకుంటాయ్.

రాష్ట్రాలు విడిపోతాయ్, అయితే ఏంటి?
లంచగొండులు లక్షణంగా బతికేస్తుంటారు,
పిల్లలు ఏడుస్తూనేవుంటారు,
రాజకీయాలు ఎప్పటిలానే ముండమోస్తు నడుస్తుంటాయ్,
ఆకులు రాలతూనే వుంటాయ్,.
కుక్కులు మొరుగుతూనే వుంటాయ్.
మారని మనుషులు కొత్తకొత్త సమస్యలను వెతుక్కుంటారు,
లేదా సృష్టించి సంతృప్తి పడుతుంటారు.
శోకాల్లో రాగలు తగ్గిపోతాయ్,.
ఆనందాలు ఆవిరైపోతాయి.
చానల్ల చర్చలు చెవుల్ని హోరెత్తిస్తూనే వుంటాయ్.
ఏది పట్టని కష్టజీవులు బతుకీడుస్తుంటారు.
కవులు అలానే రాస్తుంటారు.
ఎంత కాలం గడిచినా,. ఏ మార్పులు వుండక,
మళ్లీ కలిస్తే ఏలా వుంటుందోనన్న ఆలోచనలు వస్తాయ్.
కాలాలు కుంటి నడకల హొయలు సాగుతూనే వుంటాయ్.

ముక్కలైతే కాని చెట్టు, కట్టెలై కాలిపోదు.
గుర్తుకొస్తు సెగలై తగులుతూనే వున్నా,.



రాష్ట్రాలు విడిపోతాయ్,. అయితే ఏంటి ?
https://www.facebook.com/groups/kavisangamam/permalink/708842912501797/

15 February 2014

ఇదెలా,. ఇదెలాగో., ఇలా



చివరి చినుకులు రాల్చుకుంటూ,
మధ్యంతరంగా వర్షం వెళ్లిపోవచ్చు.
దాహాలను పూర్తిగా తీర్చుకోనీకుండా.

ఒక నిండైన నదీ ప్రవాహం, ఒకానొక సమయాన
కాస్తంత నిప్పుల సెగకే, పూర్తిగా ఇంకి పోనూ వచ్చు,
మళ్లీమళ్లీ తడులు దరిచేరకుండా.

ఎరుకతో కూడిన ఆనందాల అన్వేషణలో
ఉన్నట్టుండి, విరగకాసే వృక్షమొకటి
అర్థాంతరంగా నేల వడిలోకి కూరుకుపోనూ వచ్చు.

వెలుగులు చీకట్లలో దాక్కోనూ వచ్చు,
జీవితం ఏకాంతాన్ని హత్తుకోనూ వచ్చు.
ప్రేమలు ప్రకటించబడని చోట్ల,
విత్తనం మొలకలెత్తనని భీష్మించనూ వచ్చు.

ఆకాశం ఉరమవచ్చు, మెరుపుల అందాలు అద్దకోనూ వచ్చు.
ఉషః, సంధ్యా కాంతులతో మెరిసిపోనూ వచ్చు.
అనుదినము కొత్త కవిత్వమై కనువిందు చేయనూ వచ్చు.

ఇదెలా,  ఇదెలాగో ఇలా,..
మాయమవడం, మూసుకుపోవడం,
వీడ్కోలు చెప్పడం,. సాధ్యమా, మరి నీకు ఆకాశమా?