Pages

30 December 2014

సమ్మె

ఒక ఇష్టమైన భావానికి,స్పష్టమైన ఆకృతినిద్దామని
ఎంత తపనపడ్డా,ఒక్క అక్షరమైనా రూపుదిద్దుకోదేం ?

మనసులోని ఆలోచనల వెల్లువల మొత్తాన్ని
కొత్తగా ప్రతిబింబిద్దామంటే, అందంగా ప్రకటిద్దామంటే
ఏ ఒక్కటీ సహకరించదేం ??

స్పందనల సాగరాన్నియథాతధంగా చిత్రిద్దామంటే
ఎదురు చూడని ధోరణిలో హరివిల్లులా చూపిద్దామంటే
ఎంత వెదికినా, ఏ రంగులూ దొరకవేం ???

Oct 201
వాక్యం కవితా సంకలనంలో రెండో కవిత

29 December 2014

వాక్య ప్రకటన



కవితా సువార్త
మూడవ అధ్యాయం,పంతొమ్మిదవ వచనం
నా వాక్యం పరాధీన, ఈ లోకం బంధిఖాన.

**
మూకుమ్మడిగా చుట్టిముట్టాయ్
సందేహపు ముఖాలేసుకొని దాడికి సిద్ధమవుతూ
మా పుట్టుకకు కారణమెవరని, నా వాక్యాలు.

బిత్తర చూపుల్ని, తమాయించుకుంటూ
తెల్లపేపరైన ముఖాన్ని మరింత పాలిపోనీకుండా
భావాలను ఎంత బంధించినా,
అయ్యజాడల అస్పష్టతను, ఎరుకపరచలేని అసమర్ధత
అలుముకుంటూనే వుంది, నన్ను.

***
ఏఏ రసాయనాలు కలసి నిర్మిస్తాయో వాక్యాలను
ఏ అచేతన చర్యాఫలమై, వాక్యం నను హత్తుకుందో
ఏఏ అనుభూతులు వాక్యమై ఫ్రతిఫలిస్తాయో
ఏ అదృశ్యాలను వీక్షించిఅంతర్నేత్రాలు
సిద్దపరుస్తాయో నా వాక్యాలను.

***
చెవుల్లో దూరి దూరి,కనుగోళపు గదులు దాటి,
తలకెక్కిన రుచులేవో, ఎగబీల్చన వాసనేదో
స్పర్శ చేత అతుకబడి,ఏది నన్ను సృశిస్తుందో
ఏ జ్ఞానం వెల్లువెత్తి, వాక్యం ఉప్పొంగుతుందో
ఏ బీజం పితరుడై, నా వాక్యం జనిస్తుందో.
***
నా లోపలి, లోలోపలి వేలకోట్ల కణాలెన్నో
మోసుకుంటు తిరుగాడును
ఏ ఆదిమ ముద్రలనో, ముద్రించిన ప్రతులనో
మూలాలకై వెతుకులాట, అలివికాని అన్వేషణ
సొంత గొంతుకనేదొక మిడిజ్ఞానపు మిధ్య కదా.

సారాంశ సమీక్ష అను చివరి ప్రకటన
నా వాక్యం నాది కాదు,
 ఈ దేహం నాది కాదు.
అసలు నేను నేను కాదు

లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు
ప్రతిదీ సంతోషాన్నివ్వలేదు,
దుఃఖానికి హేతువై మిగలాలేదు

Jan 2013
వాక్యం కవితా సంకలనంలో మొదటి కవిత

28 December 2014

''వాక్యం" గురించి బొల్లోజు బాబా గారి ఆప్తవాక్యం



వాక్యంకవికి ఒక బాధ్యత
తాను ఎవరికైతే సంపుటి ఇవ్వాలనుకున్నాడో వారి ఛాయ చిత్రాన్ని సంపుటి వెనుక అట్ట పై ముద్రించి యివ్వటం ఎంతో శ్రమ. అట్లాంటి శ్రమ తీసుకున్న ఈ కవిని అభినందిస్తున్నాను---- Rajaram Thumucharla
నా ఫొటో బాక్ కవర్ గా ఉన్న వాక్యంఅనే కవితా సంకలనాన్ని అందుకోగానే ఆశ్చర్యం కలిగింది. ఇదేదో భలే ఉందే అనిపించింది. కవితా సంకలన కర్త శ్రీ భాస్కర్ కొండ్రెడ్డి. వీరు మంచి కవిగా, విశ్లేషకునిగా, సహృదయ పాఠకుడిగా అంతర్జాలంలో అందరికీ పరిచితులే. వీరి కవితలను కవిసంగమంలో అప్పుడప్పుడూ చదువుతూండే నాకు వాటన్నిటినీ మాలగాగుచ్చి పుస్తకరూపంలో అందించారు. అందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు.
ఇక ఈ కవిత్వం గురించి చెప్పాలంటే -- భావాలలో పదును, సంవిధానంలో సరళతా ప్రతీ పద్యానికి మంచి రమ్యత, తాత్వికతలను చేకూర్చాయి. వాక్యం కవితాసంపుటిలో ఏదో ఒక ఇజానికి లోబడి వ్రాసిన కవితలు కనిపించవు. చాలా కవితల్లో అంతస్సూత్రంగా కవిత్వమూ, జీవితమూ పెనవేసుకుపోయి ఉంటాయి. కవిత్వాన్ని జీవితాన్ని విడివిడిగా చూడలేనితనమే మంచి కవిత్వాన్ని సృష్టిస్తుంది. జీవితాన్ని అనుభవించి పలవరించి వ్రాసిన వాక్యాలే కవితలయ్యి పాఠకులను కవి అనుభవాలతో మమేకం చేస్తాయి.
సమాజంలోని వైరుధ్యాలను, వైవిధ్యాలను ఈ కవి చాలా నిశితంగా పరిశీలించి, ఆ అనుభూతుల్ని చక్కని కవితలుగా మలిచాడు. కరుణ, తిరుగుబాటు, నిస్పృహ, ప్రేమ, నమ్మకం, ఆశ, ధిక్కారం, వ్యంగ్యం వంటి అనేక రసాలు చాలా సహజంగా అనేక కవితలలో ఒదిగి మంచి రసస్పందన కలిగిస్తాయి. ఈ సంకలనంలోని కవితలు చదివాకా కొండ్రెడ్డి భాస్కర్ మంచికవే కాక దయగల మానవతా వాది, ఒక సాహితీ సేవకుడు అని అనిపించక మానదు.
ఈ సంకలనంలో నన్ను బాగా కుదిపేసిన కొన్ని కవితా వాక్యాలు

జ్ఞాపకమంటే మనిషిరా!
కొన్నిసార్లు అంతకంటే ఎక్కువేననుకో
స్థిరపరచుకో, ఈ సత్యాన్ని, ఇక ఈ జీవితానికి ---- సత్యావస్థ
మరణానికి ఫలానిది కారణమని
తేలికగా చెప్పేస్తుంటాం
బలమైన ఓ కారణాన్ని
నిజానికి, మృత్యువే సృష్టింస్తుందన్న వాస్తవాన్ని
మనమెప్పటికీ అర్ధం చేసుకోలేం------ మూడు సందిగ్ధాలు
తలవంచుకు బతకాలనే
లొంగుబాటు సిద్దాంతపు
తొలిపాఠం బోధించును
ఉమ్మనీటి తొట్టి నీకు----- బానిసతత్వం
తూట్లుతూట్లు పడినాక కూడ లేచినిలబడేవాడ్ని
ఏ తుపాకి నిలువరిస్తుంది------ లకలకలక
ఈ సంపుటిలో వెక్కిరింత అనే కవిత ప్రయోగదృష్ట్యా అయితే పరవాలేదు కానీ ఎందుకో మిగిలిన కవితల మధ్య అది కలువలమధ్య కొక్కిరాయిలా వెక్కిరిస్తున్నట్లనిపించింది.
గొప్ప అభివ్యక్తి కలిగిన భాస్కర్ కొండ్రెడ్డి భవిష్యత్తులో మరిన్ని మంచి కవితల్ని వెలువరించాలని కోరుకొంటూ .....

భవదీయుడు
బొల్లోజు బాబా

              ధన్యవాదాలు బొల్లోజు బాబా సర్,.

15 October 2014

సెందురూడా....... సెందురూడా by satya sreenivas



రైలు కట్టమీద సగం తెగిన సెందురూడా
ఖాళీ సీసాలో సివరి సుక్కైన సెందురూడా

ఆలైనా అమ్మవోలె సాకినోడ సెందురూడా
అయ్యబోతే అమ్మకు తెల్లసీరైనా సెందురూడా

పిడికిడంత ఆకాశంలో కోరికంత సెందురూడా
మనసులేని మనసుల్లో సగం తెగిన సెందురూడా

గుటక లేని గొంతులోన గ్రహణమైన సెందురూడా
బీడువారిన భూమిలోన రాయైన సెందురూడా

మోడువారిన జీవుల్లో కాష్టమైన సెందురూడా
నిండిన గూడులో చనుపాలైన సెందురూడా

కనురెప్పల మీద చితికిన నీటి సుక్కైనా సెందురూడా
గంజిలోన మెతుకైనా సగం తెగిన సెందురూడా

పనికోసం పట్నమొస్తే కబురు తెచ్చిన సెందురూడా
నిదుర రాక పొర్లుతుంటే జోకొట్టిన సెందురూడా

మామకోసం కూకుంటే ముద్దిచ్చిన సెందురూడా
అద్దంలో చూసుకుంటే బొట్టైనా సెందురూడా

లేనోళ్లా బతుకుల్లో అమావాస్య సెందురూడా
వున్నోళ్లా జోబుల్లో సగం తెగిన సెందురూడా

సంకురాత్రి కాలంలో ముగ్గైనా సెందురూడా
నీటివోలే  వెంటాడిన జ్ఞాపకాల సెందురూడా


మత్తులేని రోజుల్లో తొంగున్నా సెందురూడా

మోజులేని బతుకుపై తాళమైన సెందురూడా

8 October 2014

కొమరం భీమ్ - తప్పక చదవవలసిన చరిత్ర.



కొమరం భీం,పహలీ సెప్టంబర్,1940,.(1-9-1940),. తిధుల ప్రకారం ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి, .గోండులకు అత్యంత పవిత్రమైన దినం(ఈరోజు),. దోపిడికి,వంచనకు గురై తుపాకి పట్టి స్వయంపాలనకై కలలు కన్న,ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు,.. రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు,. స్థానిక షావుకారులు,అధికారులు,దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధరణమైన గోండు బాలుడు,.ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో,.హత్యచేసి,పారిపోయి,దేశమంతా తిరిగి, ఎక్కడ చూసిన అదే దుర్మార్గాలతో విసిగిపోయి,మన్నెం పోరాటి స్ఫూర్తితో ,.తిరిగి తన ప్రాంతానికే తిరిగివచ్చి పోరాటం చేసిన క్రమాన్ని తెలుసుకోవాలంటే అల్లంరాజయ్య గారు,.సాహు గారు రాసిన ఈ నవల ఒక్కసారైన చదవాలిసిందే,. ముందు మాటలో వరవరరావుగారు, ఈ పుస్తకాన్ని,.చెంఘిజ్ ఖాన్,స్పార్థకస్ లతో పోల్చినా,. దీన్ని చదవగానే నాకు గుర్తొచ్చిన పుస్తకం,. ఏడుతరాలు,.అది నేరు బానిసత్వానికి ప్రతీకగా నిలిస్తే,.,. బానిసల కంటే హీనంగా తోటివాడు ఎలా దోచుకోబడతాడో వివరించిన పుస్తకం ఇది,. ఆదివాసీ ప్రచురణలు, జోడెన్ ఘాట్ వారు 83,93 ప్రచురణల తరువాత 2004 లో (వెల: 20 రూపాయలు)ఈ పుస్తకాన్ని మళ్లీ ముద్రించారు,. తెలుగుల వెలువడ్డ మంచి పుస్తకాలలో ఒకటి, వీలైతే ఖచ్చితంగా చదవండి,.


7 October 2014

శివరాం గారి తో కాసేపు




తల్లిదండ్రులకు వందనం పాదాభివందనం,. 
కార్యక్రమం పత్రాన్ని చదివి వినిపిస్తున్న ప్రముఖ విద్యావేత్త శివరాం గారు.


వెంటాడే శిల్ప విషాదాలు - 1

ప్రకాశం జిల్లా, దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలోని బౌద్దస్థూపం వద్ద ఇలా మిగిలిపోయిన క్రీ.పూ రెండో శతాబ్థం నాటి శిల్పాలు.


















5 August 2014

నరేష్కుమార్//కాలమూ-మనుషులూ-నేననబడే నువ్వూ//



1.
ఎందుకూ...? అనడిగితే ఏం చెప్పగలం 

కొందరలా రాలిపడతారంతే. 
జీవితం ఇరుకు దారుల గుండా
సాగుతున్నప్పుడు 
నాలుగు దిక్కుల్నీ చొక్కా జేబుల్లో దాచుకొని
దుస్తులకంటుకునే పల్లేరు కాయల్లా
కొందరలా బతుకులని హత్తుకుంటారంతే

2.
 నీదే దేశం? నువ్వెవరూ?

అని వాళ్ళు నిన్ను ప్రశ్నించరు
వారి చేతుల్లో ఉన్న కొన్ని
సూర్యుడి ముక్కలని 
నిశ్శబ్దంగా నీ నోటికందిస్తారు
అకలి తీరిందా?

అనికూడా వాళ్ళు ప్రశ్నించరు.

వారికి సమాధానాలు తీస్కోవటం
నచ్చదేమో అనుకుంటావ్ నువ్వు

3.
పాత్రలనిండు గా మరిగే నీటిలో

నువ్వు ఊహించే కొన్ని తృణ దాన్యాలను
నీ మనసులో చల్లుతూ
వెలుగురేఖలని నాలుగు వైపులా పాతి
మార్మిక వ్యవసాయ క్షేత్రాలుగా
వాళ్ళు పరుచుకుంటారు 
మళ్ళీ ఎప్పుడు మొలకెత్తుతారూ
అన్న ప్రశ్నగా నువ్వు నిలబడి పోతావు


4.
హఠాత్తుగా తమ మొహాలపై

ముసుగులు తొలగించిన కొందరు
ఒకనాడు మరణించిన నీ ప్రేయసి మాటలుగా
నీ పెదవులపై కాస్త చోటుని వెతుక్కొని
తమ వెచ్చని కంబళ్ళలో దాచిన
కొన్ని కలల్ని నీ కను రెప్పలపై సున్నితంగా అద్దుతారు
తమ తలల్ని కదిలించే గడ్డిపరకలకి
కొంత వేసవినిచ్చి బదులుగా
కాస్త శీతాకాలాన్నితీస్కొని నిద్రిస్తూ... 
మనుషులను తీవ్రంగా ప్రేమించాలని 
నిశ్చయించుకుంటావు

5.
ఒక్కొక్క సారి జనం తప్ప మనుషులెవరూ లేని

నగరాల విశాల విఫణుల్లో 
నువ్వు సంచరిస్తున్నప్పుడు
నీ హృదయం దొంగిలించ బడుతుంది 
"గుండెలేని వాడుగా ఎవరూ నన్ను 
ఎవరూ నిందించరేం..? " 
అన్న నీ ప్రశ్నకి మర్రి చెట్టు పైని గబ్బిలం
ఫక్కున నవ్వుతుంది

6.
కాలం ఆగిన కొన్నిసంవత్సరాలకి

నీ జీవితం ఒక ఆకలి పాటగా 
యుద్దభూమిలోని చివరి సైనికుడి గొంతునుండి
గాలికి బహుమతిగా ఇవ్వబడుతున్నప్పుడు
మనిషి మనిషిగానే బతికేందుకు ఆకలి అత్యావశ్యకము
అనే తీర్మాన పత్రంగా మారిపొయి
కొన్ని నిశ్శబ్దాల పాటు నిలిచి పోతావ్

చివరిగా కాలం మళ్ళీ
అరిగిన బండి ఇరుసులా శబ్దం చేస్తూ కదిలాక
కొండపై పశువులు మేపే పిల్లవాడొకడు
నిన్ను గాలిపటంగా ఎగరేస్తాడు.