Pages

20 November 2015

తొండమనాడు (thondamanadu)


                                                  అది ఒకప్పుడు 18 సంవత్సరాల యుద్ధంలో పల్లవులపై  చోళులు విజయం సాధించినప్రాంతం. తొండమండలం గా చరిత్రలో ప్రసిద్ధి చెంది, తొండమాన్ చక్రవర్తి తన భక్తితో శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే వెలిపింప చేసుకున్న ప్రాంతం. తొండమాన్ చోళుల రాజధానిగా కోట అని పిలువబడిన ప్రాంతం.

తొండమనాడు, శ్రీ కాళహస్తికి 8కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామం ప్రస్తుతం.
సరే,  ప్రక్కనున్న తిరుమలను, శ్రీ కాళహస్తిని, గుడిమల్లం లను( ఇంతకు ముందు చూసినవే అనేదో కారణం) కాదని ఈ ప్రాంతాన్ని ఓ ఉదయపు సందర్శనకు ఎందుకు ఎంచుకోవల్సివచ్చిందంటే, తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో ఇచ్చిన పదో శతాబ్ధపు ముందటి చారిత్రిక కట్టాడలలో ఈ ఊరికి స్థానం కల్పించడం వలన. ఏ దేవాలయమో పేరు ఇవ్వలేదు కాని, ఆ పుస్తకంలో శిల్పం అనే 21వ అధ్యాయంలో డి. కిరణ్ క్రాంతి చౌదరి గారు ఇలా రాశారు.
                                       " దిగువ నైఋతి ఆంధ్ర దేశంలో శ్రీకాళహస్తి సమీపాన ఉన్న తొండమనాడులో చోళ సంప్రదాయం కనిపిస్తుంది. క్రీ.శ తొమ్మిదవ శతాబ్థి చివరిపాదంలో ప్రథమ ఆదిత్య చోళుని దండయాత్రతో తొండమనాడులో చోళరాజ్య వ్యాప్తి జరిగింది. అతని కుమారుడు ప్రథమ పరాంతకుడు(క్రీ.శ 907-955) తొండమనాడు వద్ద ప్రథమ ఆదిత్య చోళుని గౌరవార్థం పల్లిప్పడియ నిర్మించాడు. దక్షిణదిశలో గణపతి దక్షిణామూర్తి, పశ్చిమంలో విష్ణువు, ఉత్తరదిశలో దుర్గ, బ్రహ్మల కోష్టదేవతా శిల్పాలు ఉన్నాయి. పై భాగంలో మకర తోరణం లేకుండా సాదా ఉల్భణకోష్టం ఉంది. కోష్టదేవతలు బరువైన శరీర లక్షణాలను కలిగి వున్నారు.  గుండ్రటి ముఖాలు, పొట్టి చుబుకం, తేరిపారచూసే శూన్యనేత్రాలు, బాగా వంపు తిరిగిన కనుబొమ్మలు, చదునైన రూపీకరణ, బిరుసైన ముందు భాగం వీటి లక్షణాలు. చోళ సంప్రదాయ మౌళికత వీటిలో లేదని మాత్ర చెప్పవచ్చు."

                              ఇంతకు మించిన వివరాలు పోగుచేసుకోలేక పోయినప్పటికి ఊర్లో కనుక్కుంటే ఆ గుడి గురించి ఎవరైన చెబుతారు కదా, అని రేణిగుంట నుంచి బస్సులో తొండమ నాడు క్రాస్ వద్ద  ఉదయం 6.30 కల్లా దిగడం జరిగింది. 
( ఎవరైన వెళ్లాలనుకుంటే శ్రీకాళహస్తి నుంచి వెళ్లడం సులభమని గుర్తుంచుకోండి)

                                         అక్కడికి దాదాపు ఒకటున్నర కిలోమీటర్ల దూరంలో వున్న  గ్రామంలోకి స్వాగతం చెబుతూ, పెద్ద ద్వారము, మరియు  ఒక స్థూపము కనిపిస్తాయి. ఆ స్థూపాన్ని 2005 వ సంవత్సరంలో, అదే స్థలం వద్ద జరిగిన చోళ - పల్లవుల యుద్దానికి గుర్తుగా  దీన్ని నిర్మించారట.  దాదాపు 18 సంవంత్సరాల కాలం ( క్రీ.శ 885 నుండి 903 వరకు) జరిగిన ఈ యుద్దంలో పల్లవ రాజైన అపరిజిత, చోళరాజైన ఆదిత్య చోళుడి చేతిలో ఓడిపోయాడట. ఆ విధంగా ఈ ప్రాంతంలో చోళరాజ్య స్థాపన జరిగినట్లు చరిత్ర చెబుతుంది.



ఆ క్రాస్ లోనే ఓ బోర్డు పైన గ్రామంలోని దేవాలయాల వివరాలు వున్నాయి.
1) ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం
2) కోదండ రామేశ్వర స్వామి దేవాలయం (బొక్కసం పాళెం)
3) పుట్టాలమ్మ దేవాలయం

1) ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం
                                                        బైక్ లో లిఫ్ట్  ఇచ్చిన అతను  చెప్పిన దాని ప్రకారం, ఊరి సెంటర్ నంచి ఓ అరకిలోమీటరు నడిచి,మొదట ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం కి చేరుకున్నాను.  గుడికి ముందుగానే  టి.టి.డి వారు నిర్మించిన  ఓ  మూడు  అంతస్తుల వసతి గృహాన్ని, పిల్లలపార్కుని, పెద్ద కల్యాణ మండపాన్ని గమనించవచ్చు( ప్రస్తుతం అన్నీ నిరుపయోగంగా వున్నట్లనిపించాయి)

                                            ఈ దేవాలయాన్ని టి.టి.డి వారు పూర్తిగా తీసివేసి ఆ శిధిలాలు మరియు కొత్త రాళ్లతో కలిపి నూతనంగా నిర్మిస్తున్నారు. లోపల కొన్ని స్తంభాలు పాతవి కనిపిస్తాయి. ముందు వరండా అంతా సిమెంట్ తో స్లాబ్ వేసారు.  లోపల స్తంభాలపై అక్కడక్కడ కొన్ని శాసనాల వాక్యాలు కనిపిస్తాయి. పక్కనే వున్న చిన్న రూమ్లో, ప్రధాన విగ్రహాలను ఉంచి పూజలు జరుపుతున్నారు. దాదాపు రెండున్నర అడుగులు వుండే వెంకటేశ్వర స్వామి,తన ఇద్దరిదేవేరులతో కొలవైవుంటాడు ఇక్కడ.దీనికి సంబంధించిన విషయాలు వున్న ప్లెక్సీ ఒకటి తలుపుకి తగిలించివున్నారు. దానిలో విషయాలు ఇలా వున్నాయి.
      ఆకాశరాజు, తొండమానుడు అన్నదమ్ములు. వెంకటేశ్వర స్వామితో, ఆకాశరాజు కూతురు పద్మావతి వివాహము అయిన తరువాత, తొండమానుడు కి  రాజ్య పంపకాలలో ఈ ప్రాంతం వస్తుంది. అందువలననే తరువాత  కాలాలలో ఇది తొండమండలంగా ప్రసిద్ది చెందిది. ఈ తొండమానుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో సేవించేవాడు. వయసు మీరి, ముసలి వాడై తిరుమలకు వెళ్లలేని అశక్తతను స్వామి వారితో వ్యక్తం చేసినప్పుడు, స్వామి వారు అభయ హస్తంతో, కూర్చున్న భంగిమలో శ్రీదేవి, భూదేవి సమేతంగా అతని ఇంటనే వెలుస్తాడు. అదే ఈ గుడి.
                                             దీనిలో చారిత్రక అంశాల ప్రాధాన్యత కొంత తక్కువగానే కనిపిస్తున్నప్పటికి, వరాహపురాణంలోని ఈ కథే చాలా వరకు ప్రచారమై వుంది. వీరు చోళ రాజులుగానే కనిపిస్తారు ఈ కథలో కూడా.
 పూర్తిగా కొత్త దేవాలయంగా మార్చబడిన ఈ గుడిలో ప్రాచీనత ఆనవాలు పట్టడం ఇక  కష్టంగానే అనిపిస్తుంది. ఆర్కియాలజీ వారి పాత్ర ఇక్కడ మనకేమీ కనబడదు. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోనే నూతన గుడి నిర్మాణం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ( 7.30)                                       ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవాలయం ఫోటోల కోసం క్లిక్ చేయండి

2) కోదండ రామేశ్వర స్వామి దేవాలయం (ఆదిత్యాలయం)

                                                                    తొండమనాడు గ్రామానికి పక్కనే వున్న బొక్కసం పాలెంలో  ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరాన ఈ దేవాలయం వుంది.  నేను చూడాలని వెళ్ళిన చోళులు నిర్మించిన  దేవాలయం ఇదేనని నాకు అప్పటికి తెలియదు.                                              చారిత్రకంగా అత్యంత పాధాన్యత కలిగిన ఈ దేవాలయాన్ని కూడా టి.టి.డి వారు పూర్తిగా మళ్లీ నిర్మించారు. ఈ నిర్మాణం దాదాపు పూర్తై కొత్త దేవాలయంలానే ఇది కనిపిస్తుంది. ఇది జంట దేవాలయాల సముదాయం, శివాలయం, పక్కనే పార్వతి దేవాలయం.  అందమైన భారీ గాలిగోపురం, చిన్న నంది మండపం, తులసి కోట ఇటుకలతో నిర్మించిన ఓ భావి, ఒక మూలగా నవగ్రహ మండపం, విశాలమైన ఆవరణ. అక్కడక్కడ గోడలపై కొన్ని శాసనాలు, చిన్న విగ్రహాలు తప్ప మిగతావన్నీ కొత్తవిగానే అనిపిస్తాయి. పునర్ నిర్మాణం దాదాపుగా పూర్తైన ఈ ఆలయంలో ఇంకా పూజలు మొదలుకాలేదు. శివలింగం మరియు నందిపై వస్త్రం కప్పివుంచారు.
                                                  ప్రథమ పరాంతకుడు(క్రీ.శ 907-955) తన తండ్రి ఆదిత్యచోళుని జ్ఞాపకార్థం నిర్మించిన ఆదిత్యాలయం ఇది. తరువాతి కాలాలలో దీని పేరు మారినట్లుంది.  దీన్ని పల్లిపాడై అని పిలవడానికి కారణం, ఈ దేవాలయం ప్రథమ ఆదిత్య చోళుని అస్థికలపై నిర్మిచబడటమే(బౌద్ద స్థూపాలలాగా).  సమాధులపైన నిర్మించబడ్డ  తక్కువ ఆలయాలలో ఇది ఒకటి(రామనాథపురం లోని సుందర పాండ్య ఈశ్వరాలయం ఇలాంటిదే ).  ఇక్కడ అనేక చోళ శాసనాలు దొరికినట్లుగా చెబుతున్నారు.  ఇది ప్రధానంగా శైవంలోని మహావ్రతులు ఆధీనంలో వున్నట్లు తెలుస్తుంది.  ఆ కాలంలో శైవంలోని భిన్న శాఖలైన పాశుపతులు, కాలాముఖులు , నిరాశ్రయులు,మహాపాశుపతుల వంటి శాఖల పేర్లు కూడా ఇక్కడ దొరికిన శాసనాలపై కనిపిస్తాయట.  కాలముఖు పూజారులనే మహావ్రతులు అని పిలిచే వారని కొంత మంది అంటారు. మరొక శాసనం వెయ్యిమంది భక్తుల అన్నదానం కోసం కావలసిన కానుకలను ( వీరిలో 300 మంది బ్రాహ్మణులు, భిన్నమతాల వారు 500 మంది, 200 మంది శైవ మునులు) మహా వ్రతులు నాయకుడైన వాగీశ్వర భట్టారకుడికి  ఇచ్చినట్లు తెలుపుతుంది.
                             మొత్తంమ్మీద  ప్రథమ పరాంతక చోళుడు (క్రీ.శ 907-955)  శైవాన్ని విశేషంగా ఆదరించినట్లు చెప్పడానికి ఈ దేవాలయం సాక్ష్యంగా నిలుస్తుంది. గాలి గోపురం తరువాత కాలంలో వేరేవారు నిర్మించినట్లుగా అనిపిస్తుంది.  దాని సమాచారం నాకు దొరకలేదు.
                                      ఈ దేవాలయం పక్కనే టి.టి.డి వారు దాదాపు 40లక్షల ఖర్చుతో నిర్మించిన వసతి గృహం తాళం వేసి కనిపిస్తుంది.


                                     ఊరికి బొక్కసం పాళెం అని పేరు రావడానికి,  ఆ  ప్రాంతం ఒకప్పుడు స్మశానం అయ్యివుండటానికి సంబంధం వుందేమో, మా ప్రాంతాల్లో కొన్ని చోట్ల స్మశానాన్ని బొక్కల గడ్డ అని పిలుస్తుంటారు. దీనిపైన ఎవరైన శోధించవచ్చు. ( ఈ పాటికే చేసి వుంటే వాటి వివరాలను కనుక్కోవచ్చు)
                                                    దేవాలయం ఎదురుగా వున్న రావి చెట్టు క్రింద నాగశిలను చూసి, అక్కడ నుండి మళ్లీ సెంటరుకొచ్చి టిఫిన్ చేసి, ఒక కిలోమీటరు దూరం వున్న పుట్టాలమ్మ దేవాలయానికి నడక ప్రారంభించాను(8.30)

3) పుట్టాలమ్మ దేవాలయం
                                                                 నేను ఈ దేవాలయం సమయం లేకపోవడం వల్ల చూడలేక పోయాను. దీనికి కారణం దీనికి ముందుగా కనిపించిన ఓ శిధిల ఆలయం, అదే ధర్మరాజు ఆలయం.

                                      పుట్టాలమ్మ దేవాలయం, ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ది చెందినట్లుగా అనిపించింది. మిగతా ఆలయాలతో పోలిస్తే జనం తాకిడి కూడా ఇక్కడ ఎక్కువలా అనిపించింది. బహుశా గ్రామదేవత అయ్యివుండటం వలన. మరోసారెప్పుడన్నా వీలైతే  ఈ దేవాలయాన్ని చూడాలి.

4) ధర్మరాజు ఆలయం

                               ఇది చూడగానే, నేను చూడాలనుకున్న చోళుల ఆలయం అనుకున్నాను(కానీ  కాదనుకోండి).  ఎక్కువ భాగం ఇటుకలు, సున్నంతో నిర్మితమై,  కేవలం స్లాబ్ లో, ముందు పక్కన వున్న నాలుగు స్తంభాలు మాత్రమే రాతివి.  నేను వెళ్లే సమయానికి ఒక పూజారి దీపం వెలిగిస్తున్నాడు. లోపల ఒక రాతి విగ్రహం, ఒక చెక్క విగ్రహం వున్నాయి. ఒక అరుగు లాంటి దానిపై అవి వుంచబడినవి.  చరిత్ర గురించి తనకు తెలియదని చెప్పాడు. ప్రకాశం జిల్లాలో పిటికాయగుళ్లలోని 8వ శతాబ్థానికి చెందిన పిటికేశ్వరస్వామి ఆలయాలను పోలివున్న ఇది, అదే కాలానిదై వుంటుందేమో అనుకున్నాను, నేను.  కాని దీనికి సంబంధించిన సమాచారం దొరకలేదు.
                                గోపురం పై చాల చక్కని శిల్పాలను, నిర్మాణాన్ని కలిగివుండి, చూడగానే ఆకట్టుకుంటుంది.  ఈ చిన్న ఆలయం. చుట్టూ ఆక్రమణలతో, నిర్లక్యంచేయబడటం వలన అది ఒక డంప్ యార్డ్ లా అనిపిస్తుంది. చూట్టు వున్న గోడల్లో ఏ గోడ మనకు పూర్తిగా కనబడదు. 
                        ధర్మరాజు ఆలయం ఫోటోల కోసం క్లిక్ చేయండి
                     ముందు వరండా(15*10), తరువాత ఓ గది(10*8), ఆ తరువాత గర్భగుడి(10*8) వున్న ఈ ఆలయాన్ని త్వరలో పూర్తిగా కూల్చి, కొత్త ఆలయాన్ని కట్టే ఉద్దేశ్యం వున్నట్లు పూజారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఆర్కియాలజీ వారు, దీన్నికొంత పట్టించుకుంటే, ఈ ఆలయం ఏ కాలానకి చెందినదో, ఎవరు నిర్మించారో లాంటి విషయాలు. ఇంకొన్ని కొత్త సంగతులు ఏమన్నా బయటకు రావచ్చు. ఆ ప్రాంతంలో ఎవరన్నా చరిత్ర పట్ల ఆసక్తి వున్నవారు దీనిపైన దృష్టిపెడితే, ఈ ఆలయం ఇంకొంత కాలం మనగలిగే అవకాశం వుంది( 9.30)
                                                    తిరుపతి లో సైన్స్ వర్క్ షాప్ కి 10.30 కి హాజరు కావల్సినందున ఇక అక్కడినుంచే వెనక్కి రావడం జరిగింది.  

సూచనలు

సొంత వెహికల్లో వెళ్తే తొందరగానే చూడవచ్చు. లేకపోతే ఓ మూడు కిలోమీటర్లన్నా నడవడానికి సిద్దంగా వుండాలి.
తొండమనాడుకి  దగ్గరలో వున్న బత్తిమల్లయ్యకోనలో కూడా ఓ చూడదగ్గ టెంపుల్ వుందట, వీలైతే దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి.
  ********                                                ఎక్కువ చారిత్రక ఆసక్తో లేదా ఆ ఊరి దేవాలయాలపై ప్రత్యేకమైన భక్తో ఉంటేనే  తొండమనాడు ట్రిప్ ఆనందదాయకంగా వుంటుంది.  2/5





19 July 2015

పురుగులు



భిన్న దృష్టికోణాల భేదాలు
అభిప్రాయాలను దాటి
ప్రిస్టేజీ పోరాటాలుగా
మలుపు తిరుగుతున్నప్పుడు,
దాడి, ప్రతిదాడి పర్వాల పర్వర్షన్లో
వదిలేస్తున్నదేందో
వంకర చూపునొదిలి తిన్నగానే
చూడడాన్ని నిజంగానే నేర్చుకోవాలి.

నచ్చడాలు, నచ్చకపోవడాలు
ఇష్టాయిష్టాలు
లాభనష్టాలు, కోపతాపాలు
వ్యక్తిగతాల నుంచి సామాజికాలుగా
మార్పుచెందుతున్నప్పుడు
మరో పరిణామ సిద్దాంతాన్ని
కొత్తగా కనుక్కోవాలి.

తొక్కబడ్డ శవాల
ఇంగితజ్ఞానాల అవగాహనల్లో
పదేపదే మునిగి తేలుతున్నప్పుడు
విలువల గురించి చింతించేవాడు
చర్వితచర్వణంగా చచ్చేచావులను
తప్పుకునే మార్గాలను వెతికిపట్టుకోవాలి.
లేకుంటే
సిద్దం చేసుకున్న సమాధుల్లో దూరి
జీవితాంతం తనతో  తానే మాట్లాడుకుంటూ

తనకు తానే ఓ కాలక్షేపమై మిగిలిపోవాలి.

17/7/2015

17 July 2015

పాతాళానికి ప్రయాణం

ఎ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ద ఎర్త్,. 


జూల్స్ వెర్న్,1864 లో ఫ్రెంచ్ లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. చెన్నై ఐఐటిలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస చక్రవర్తి , ఈ  సైఫై ( సైన్స్ ఫిక్షన్) క్లాసిక్ నవలను తెలుగు పాఠకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో, ఈ పూర్తి నవలను తెలుగులో అనువదించారు. దీన్ని జనవిజ్ఞానవేదిక, మంచిపుస్తకం వారు ప్రచురించారు. ఇది వరకే ఈ పుస్తక సంక్షిప్త అనువాదాలు తెలుగులో వచ్చినప్పటికి, పూర్తి స్థాయి అనువాదంగా దీన్ని చెప్పుకున్నారు అనువాదకులు.  తెలుగులో ఇప్పటికి ఓ మంచి సైన్స్ ఫిక్షన్ నవలను మనం చూడలేదంటే అందులో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఆసక్తికరంగా అనువదించిన ఈ నవలలోకి ఒక్కసారి తొంగిచూద్దాం.
ప్రధాన పాత్రలు - స్వభావాలు
1) ఫ్రొఫెసర్ ఒట్టో లీడెన్ బ్రాక్ కోపం, అసహనం, జ్ఞానం మూర్తిభవించి, ఏ పరిస్థితులకు చలించకుండా తాను అనుకున్నదానికి కట్టుబడే వ్యక్తి. ప్రముఖ శాస్త్రవేత్త, జియాలజిస్ట్.
2) ఏక్సెల్:  ఫ్రొఫెసర్ గారి (పెంపుడు) మేనల్లుడు, చాలా సాధారణమైన వ్యక్తి,  సాహసయాత్రల పట్ల విముఖత, చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతాడు, సున్నితుడు, గ్రౌబెన్ ప్రేమికుడు
3) హన్స్ బైకి:   ఐస్లాండ్ లో వీరి యాత్రకు  అత్యంత విధేయుడైన గైడ్, దృడచిత్తుడు,
4) గ్రౌబెన్ : ఫ్రొఫెసర్ గారి పెంపుడు కూతురు, ధైర్యస్తురాలు. ఏక్సెల్ ను యాత్రకు ఉత్తేజితుడిని చేసే ప్రయత్నం చేస్తుంది. ( పరిమితమైన పాత్ర)

జర్మనీలోని హాంబర్గ్ పట్టణలో మే, 14, 1863 లో ఈ కథ మొదలవుతుంది, ఆగస్ట్ 29,30(?)ఇటలీలోని చిన్న ద్వీపమైన స్ట్రాంబోలిలో ముగుస్తుంది.

 ఈ వైజ్ఞానిక సాహస యాత్ర  ఆనాటికి ప్రసిద్ధమైన అనేక సాంకేతిక, భౌగోళిక అంశాలను ప్రమాణికంగా తీసుకొని ముందుకు సాగుతుంది.
ఈ నవలంతా ఏక్సెల్  తన మాటల్లో చెప్పుకుంటు పోతుంటాడు, సంక్షిప్తంగా కథ ఇలా సాగుతుంది.

ప్రొఫెసర్ గారు కొన్న ఓ పాతపుస్తకంలో  16వశతాబ్థానికి చెందిన ఐస్లాండ్ ఆల్కెమిస్ట్, పండితుడు ఆర్నే సాక్నుసెం రూనిక్ భాష లో రాసి  వున్న చిన్నసంకేత ప్రాచీన రాతప్రతి దొరుకుతుంది ( మే 14).

 దానిలో ఐస్లాండ్ లోని నిద్రాణస్థితిలోని స్నెఫెల్ అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భూమి మధ్య భాగానికి దారివుంది అని వుంటుందని  డీకోడ్ చేస్తారు. ఇక ఫ్రొఫెసర్ గారు వెంటనే ఏక్సెల్ ను వెంట తీసుకొని (మే16)  ఐస్లాండ్ బయలుదేరతారు.  హాంబర్గ్ నుండి కేల్ వరకు రైల్లో, అక్కడ నుండి కొపెనహెగన్( డెన్మార్క రాజధాని) కు ఎల్నోరా ఓడలో వెళ్తారు.ఓ వారం విడిది అనంతరం జూన్ 2వ తేది  వల్కీరా అనే ఓడలో స్కాట్లాండ్, ఫారోస్ దీవుల మీదుగా 13తేదికి ఐస్లాండ్ రాజధాని రిజోవిక్ కు, చేరుకుంటారు. 

 స్థానిక ఫ్రోఫెసర్ ఫ్రెడరిక్సన్ వీరికి అతిధ్యం ఇచ్చి, హన్స్ అనే వేటగాడిని, ఈ యాత్రకు మార్గదర్శకుడిగా కొంత జీతానికి కుదిరిస్తాడు.
జూన్ 16వ తేది, రిజోవిక్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని స్నెఫెల్ అగ్నిపర్వతం వద్దకు ప్రయాణం మొదలుపెడతారు. మరో ఇద్దరి సహాయకులను తీసుకుని గుర్రాల సహాయంతో నడుచుకుంటూ, గర్దార్, స్టాపీ అనే ఊర్లమీదుగా స్నెఫల్ పర్వతాన్ని అధిరోహించి, జూన్ 25 నాటికి, ఆ అగ్ని పర్వత బిలం వద్దకు చేరుకుంటారు.

ఇక, సహాయకులు వెనుతిరిగిన తరువాత, ఈ ముగ్గురు ఆ బిలం నుంచి పాతాళానికి అవరోహణ సాగిస్తారు.

 కొన్ని సార్లు దార్లు తప్పుతూ, మంచినీటికై అలమటిస్తూ, బయటపడతామో లేదో తెలియని చిత్రవిచిత్ర పరిస్థితుల్లో ఆ కాలానికి పాచుర్యంలో వున్న వివిధ సిద్దాంతాలను చర్చించుకుంటూ, భూగర్భంలోని సముద్రాలను, జీవరాశుల్ని సంభ్రమాశ్చార్యాలతో చూసుకుంటూ అనేక సాహసల అనంతరం చివరకు అదృష్టవశాత్తూ,  మధ్యధరా సముద్రంలోని స్ట్రాంబోలి అనే దీవిలో వున్న ఓ అగ్నిపర్వతం ద్వారా బయటకు విసిరివేయబడతారు.

 



వీరు భూకేంద్రానికి వెళ్లారో లేదో చెప్పలేదు కాని, ఆద్వంతం ఆసక్తిని రేకేత్తిస్తూ, విజ్ఞాన శాస్త్ర విషయాలను చర్చిస్తూ నడిచే కథా,కథనం పిల్లల్నే కాదు, పెద్దలను కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సైఫై నవలల్లో గొప్పగా కీర్తించబడే ఈ నవల అనేక సినిమాలకు,
 సాహసయాత్రలకు  స్పూర్తిగా నిలిచింది.
234పేజీలు, 110 రూపాయల వెలతో వున్న ఈ పుస్తకం ఫస్ట్ రీడింగ్ టైమ్ 2నుంచి 3గంటలు. ఈ పుస్తకం కావలసినవారు సంప్రదించాల్సిన చిరునామా
 జనవిజ్ఞానవేదిక, జి.మాల్యాద్రి, 162, విజయలక్ష్మీనగర్,నెల్లూరు - 524004,ఫోన్. 9440503061.
(లేదా) మంచిపుస్తకం, 12-13-439, వీథినెం.1, తార్నాక, సికింద్రాబాద్- 500017 ఫోన్ .9490746614.
ఏవైనా గవర్నమెంట్ పాఠశాలలు అనువాదకులు వి. శ్రీనివాస్ చక్రవర్తిగారిని సంప్రదిస్తే,. స్కూల్ లైబ్రరీ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పుస్తకంతో పాటు మరికొన్ని పుస్తకాలను ఉచితంగా పంపుతున్నారు. వారి బ్లాగ్  లింక్  ఇది.
పాతాళానికి ప్రయాణం వారి బ్లాగ్లో కూడా చదవచ్చు, దాని లింక్

ఈ బుక్ కావాలనుకుంటే కినిగే లింక్

7 July 2015

|| సూచన||



హేయ్,
ఆలోచన  అదృష్టం కాదు,
అనర్థమని
నెత్తినోరు కొట్టుకుంటుంటే,

అర్థంలేని
బండ బతుకని
హేళనచేశావ్ కదా!

చుట్టుకుపోయిన
ఆక్టోపస్ చేతుల్లాంటి ఆలోచనల మధ్య
బిగసుకుపోయిన మెదడునాళాల వేదన సాక్షిగా
ఇప్పుడైన ఒప్పుకుంటావా!

అంతా అయిపోయాక
తీరుబడిలో తప్పోప్పుల పట్టికేసుకుంటే
అదింకో తెగని ఆలోచన కదా!

అందెందుకు గాని ఇంకా
నడువ్, ఇపుడైనా కాస్తంత నిరాలోచనగా.


24/6/15

6 July 2015

మన చుట్టూ వుండే పదార్థం ( 1 యూనిట్ నోట్స్ ) 9వ తరగతి బౌరశా

కొంత ద్రవ్యరాశిని కలిగి వుండి,
స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థం అంటారు.
పదార్థం మూడు స్థితులలో లభిస్తుంది.
1) ఘణ స్థితి 2) ద్రవస్థితి 3) వాయు స్థితి
ఆకారం, ఘణ పరిమాణం, సంపీడ్యత, వ్యాపనం అనేవి పదార్థాల యొక్క కొన్ని ముఖ్యమైన ధర్మాలు.

ఆకారం
ఘణపదార్థాలు నిర్థిష్టమైన ఆకారాన్ని కలిగివుంటాయి.
ద్రవపదార్థాలు వాటిని నిల్వచేసే పాత్రలరూపాన్ని బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటాయి.
వాయువులు ఆకారాన్ని కలిగివుండవు.
ద్రవాలు, వాయువులు ఒక చోటు నుంచి మరొక చోటుకి సులభంగా ప్రవహిస్తాయి. అందుకే వాటిని ప్రవాహులు అని అంటారు.

ఘణపరిమాణం
ఘణ మరియు ద్రవ పదార్థాలు నిర్థిష్ట ఘణపరిమాణాన్ని కలిగివుంటాయి.
వాయు పదార్థాలకు నిర్థిష్ట ఘణపరిమాణం వుండదు.

సంపీడ్యత
ఘణ, ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు వాయువులు ఎక్కువ సంపీడ్యతను పొందుతాయి. అందువలననే LPG, CNG గ్యాస్ సిలిండర్లలో అత్యధిక పీడనంతో, ఎక్కువ వాయువును నిల్వచేస్తారు.
CNG ( COMPRESSED NATURAL GAS) సంపీడిత సహజవాయువు.
LPG(LIQID PETROLIUM GAS) ద్రవ పెట్రోలియం వాయువు.
వ్యాపనం
* ఒక పదార్థం మరొక పదార్థంలో కలిసే ప్రక్రియను వ్యాపనం అంటారు.
పదార్థ స్వభావం పై ఆధారపడి వ్యాపనం ఏ స్థితిలోనైనా జరుగుతుంది.
వ్యాపనం యొక్క వేగాన్ని వ్యాపనరేటు అంటారు..వాయువుల యొక్క వ్యాపనరేటు చాల ఎక్కువగా వుంటుది.
ఆక్సిజన్  రక్తంలోకి,నీటిలోకి వ్యాపనం చెందడం వల్ల జంతువులు, చేపలు లాంటివి జీవించగలుగుతున్నాయి. కూల్ డ్రింక్స్, సోడాలలో కార్బన్ డై ఆక్సైడ్ వ్యాపనం చెందిస్తారు.

పదార్థం చిన్నచిన్న అణువులతో ఏర్పడుతుంది.
ఈ కణాల మధ్య ఆకర్షణ బలాలు వుంటాయి. పదార్థాన్ని బట్టి, పదార్థ స్థితిని బట్టి ఈ ఆకర్షణ  బలాలు మారుతూ వుంటాయి.
ఈ కణాల మధ్య కొంత ఖాళీ స్థలం వుంటుంది. ఘణ, ద్రవ, వాయు పదార్థాలలోని అణువుల అమరిక ఇలా వుంటుంది.


పదార్థాల స్థితి మార్పు.
పదార్థాలు ఒక స్థితినుండి మరొక స్థితికి మారుతాయి.
ఇది ఉష్ణోగ్రత మరియు పీడనం అనే అంశాలపై ఆధారపడి వుంటుంది.

ఉష్ణోగ్రతా మానాలు.
ఒక పదార్థం యొక్క వెచ్చదనం లేదా చల్లదనం స్థాయినే ఉష్టోగ్రతా అంటారు. ఉష్ణోగ్రతను ప్రధానంగా సెంటిగ్రేడ్ మరియు కెల్విన్ మానాలలో కొలుస్తారు. ఏదైనా ఉష్ణోగ్రతను సెంటిగ్రేడ్ మానం నుండి కెల్విన్ మానంలోకి మార్చాలంటే 273 ను కూడాలి.
ఉదా: 0 o C =  0 + 273 = 273 o K
ఏదైనా ఒక ఉష్ణోగ్రతను కెల్విన్ మానం నుంచి సెంటిగ్రేడ్ మానంలోకి మార్చాలంటే 273ను తీసివేయాలి.
 ఉదా : 0 o K =  0 - 273 =  -273 o C
ద్రవీభవన స్థానం
ఏ నిర్థిష్ట ఉష్ణోగ్రత వద్ద ఘణపదార్థాలు, ద్రవ స్థితికి మారుతాయో, ఆ ఉష్ణోగ్రతను దాని యొక్క ద్రవీభవన స్థానం అంటారు.
మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 C   or  273K
మరుగు స్థానం
ఒక నిర్థిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రవపదార్థాలు వాయు రూపంలోకి మారుతాయి.
ఆ ఉష్ణోగ్రతనే వాటి మరుగు స్థానం అంటారు.
నీటి యొక్క మరుగుస్థానం 100C or  373
ఒక పదార్థం యొక్క ద్రవీభవన, మరుగుస్థానాలు దానిలోని కణాల మధ్యగల ఆకర్షణ బలాల మీద ఆధారపడి వుంటాయి. 
కణాల మధ్య ఆకర్షణబలాలు ఎక్కువగా వుంటే ఆ పదార్థాల ద్రవీభవన, మరుగుస్థానాలు ఎక్కువగా వుంటాయి.
గుప్తోష్ణం
 ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద కేవలం స్థితి మార్పు కోసం ఒక పదార్థం గ్రహించే లేదా విడుదల చేసే ఉష్ణశక్తినే గుప్తోష్ణం అంటారు.
దీనిని L అనే అక్షరంతో సూచిస్తారు.

ఉత్పతనం 
వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘణస్థితి నుండి వాయుస్థితికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియనే ఉత్పతనము అంటారు.
దీనికి ఉదాహరణ అయోడిన్

ఘణస్థితిలో వున్న కార్భన్ డై ఆక్సైడ్ ను పొడిమంచు అంటారు. సాథారణ వాతావరణ పీడనం వద్ద ఇది సులభంగా వాయురూపంలోకి మారిపోతుంది.
భాష్పీభవనం ( ఇగరడం)
ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను భాష్పీభవనం అంటారు.
ఇది ఉపరితల ప్రక్రియ.
ఇది శీతలీకరణ ప్రక్రియ.
ఇది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది.
ఒక ద్రవం యొక్క భాష్పీభవన రేటు , ఆ ద్రవ ఉపరితల వైశాల్యం , ఉష్ణోగ్రత, గాలిలోని ఆర్థ్రత, గాలివేగం వంటి అంశాలపై ఆధారపడుతుంది.
నిత్యజీవితంలో భాష్పీభవనం
చెమట ఆవిరైటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అనిపిస్తింది.
కుండలోని నీరు చల్లగా కావడం.
కుక్కలు నాలుకను బయటకు వుంచడం ద్వారా వాటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి.
బర్రెలు, గేదెలు, పందులు లాంటి జంతువులు బురదపూసుకోవడం, నీటిలో మునగడం ద్వారా వాటి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకుంటాయి.
( ఇది తెలుగు మీడియం విద్యార్థులకోసం, అవసరమైన వారు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చు)
( ఏమైనా మార్పులు చేర్పులు వుంటే సూచించగలరు)