Pages

4 August 2014

అనేకాలు


దాటుకొచ్చిన దూరాలు ఎప్పుడూ సగాలే.
తాబేలా, కుందేలా అనేది చరిత్రకొదిలెయ్.

ఎంతగా విస్తరిస్తావో, అనేది ముఖ్యం కాదు 
ఎంతగా కురుస్తావు అనేది ఎదురుచూపుల ప్రశ్న.

స్వాగతించు రాయలేకపోవడాన్ని,
నీ వరకు నీవైనా,.
దాన్నే హత్తుకోవడానికీ ప్రయత్నించు.

ఇంతకాలం రాసి రాసి, దేన్ని ఉద్దరిస్తున్నావో
ఏ భ్రమల్లో పడి అక్షరాల్లో దొర్లుతున్నావో.

ఇక ఇప్పుడైనా,.. నీకింద పడి 
ముక్కలైన జీవితాల శాపనార్థాలు వింటుండు.

బద్దలుకొట్టుకున్న హృదయాల్లో ఏమీ మిగలదు.
కొట్టుకుపోతున్న దేహాల్లో ప్రాణమూ వుండదు.
అదే వదిలిపోయాక, కవిత్వమూ విగతమే.
Oh,. still are you available ?

2 August 2014

ఫ్యూజ్ లెస్



మళ్లీ అలాగే చెప్పుకుందాం
అదీ ఏ జన్మానిదైనా అంతేకదా!
కొన్ని రాకల వెనుక కారణాల మీద
ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా
మధుర గీతాలు రాసుకున్నా
ఎవడికొరిగేది ఏంటో ఎవడు నిర్థారిస్తాడు?

ఒక అశోకుని లెక్క యుద్ద వీరుడై
 దుఃఖపు దారిని ఎన్నుకుని
శవాల కుప్పల మధ్య కుములుతున్న
జనుల గుండెల రగిలింతల గాయమైన
దేశపు దేహాల సందోహాల సందేహ హేల భరిస్తూ.

తధాగతా, మళ్లీ ప్రేమ గురించే మాట్లాడు
ఒక మంత్రగాడి మాదిరి ఈ జనుల చెవుల్లో
పదే పదే తడుతు హృదయపు తలుపులను.
లంజల దిబ్బల మతపూతలు మట్టికొదిలి.

యేసు దేవా, ముళ్లకిరీటపు రక్తదాహాల నేల
ఇంకా అలాగే చెర్నాకోలై చెలరేగుతూనే వుందే,
పొరుగువాడి మిస్సైల్ల దాడికి చెదిరిన
అవయపు చెత్తకుప్పల
శత సహస్ర సంప్రోక్షణల్లో
నిరంతర విషాద స్తోత్రమై, జీవితం.

ఇక చెప్పడానికి, ఏం వుంటుది ప్రవక్తా!
చీకట్లలో నెలవంకవై నువ్వు చూస్తూనే వున్నప్పుడు.


1 August 2014

లోల్


అచ్చులో అక్షరం వెలిగిపోయిదా,
ముందు మాటల సొల్లు తడిపిపోయిందా.

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

తాగితూగి నువ్వు మందు పార్టీలల్లో
వీరకృత్యాల్ చేసి శోభించినావా
కుళ్లు జోకుల మీద శయనించినావా

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

సన్మాన పత్రాలు రాయించుకున్నావా
ప్రశంసలా పూలెన్నో చల్లుకున్నావా.

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

పుస్తకం అచ్చేసి
అవార్డులను పట్టి
ఫోటోలు తీయించి
పేపర్లో వేయించి
ఫేసుబుక్కుల వాలు ఎక్కించినావా
విజిటింగ్ కార్డులా పంచి పెట్టావా

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

ఎవడైన దండేసి దండమెట్టాడా
 ఓ శాలువా కప్పి నీ కళ్లు తుడిచాడా

నువ్వెట్ట కవివిరా సోదరా

కనికట్టు కనరా మిత్రుడా,.,

26 July 2014

వెర్రిమాలోకం


నేలనాదని ప్రకటించుకోవడం
మనకెప్పటికీ జన్మహక్కే.

ఒక జెండాను వొడిసి పట్టుకుని
గుండెల్లో నింపుకున్న విశ్వాసం పైకెగరేసి
శవాలను కాళ్లతో ముద్దాడుతూ
నడుస్తూ ఆ రక్తసిక్త మరణ నగరాల మీద,
ఆచంద్రతారర్క అత్యవసరం
ఆ నేల నాదని,
ఖచ్చితంగా ప్రకటించుకోవవడం.


మనం పోరాటాన్ని హత్తుకుందాం
ఈ రోజు చచ్చైనా సరే
రేపటి వాడి శవాన్ని కలగందాం
పిల్లల శరీరాలను పణంగా పెట్టైనా సరే.

నేల మనకెప్పటికి ముఖ్యం
వేల జీవితాలదేముంది
 మళ్లీ మళ్లీ పుట్టుకొస్తునే వుంటాయ్.

ఏడుపులు పాత పడతాయ్,
చచ్చిన కళేబరాలు కొత్తనేలవుతాయ్.
పాత భూముల మీద కంబళ్లు పరుస్తాయ్.

నీకో రహస్య తెలుసా
మనకి చంపడం, చావడం ఒక సరదా
దానికి నేలను ఎరగా వేస్తాం.

వున్నది వున్నట్టు వుంచక పోవడం
ఒక నిత్యానందం
దానికి జీవితాలనైనా వదిలేస్తాం.

రెండు చేతుల్లోకి ఎత్తుకుని
ఒక ఆత్మీయ విగతదేహాన్ని
దాని గుండెల్లో తలదాచుకుని విలపిద్దాం.

నేల ఎప్పటికి దుఃఖించదు
నీలా లేదా నాలా.


7 July 2014

బేకారీలు


నాటకీయత చేర్పులేకుండా
సత్యమైనా ఇక్కడ పొర్లుదండాలు పెట్టాల్సిందే.
వాస్తవాన్ని వాస్తవంగా కాక
కాస్త వాపునద్దుకుని 
పోపులాగా ఘమాయించాల్సిందే.

అబ్బే,
అప్పటిదాకా ఎవడికీ
ఏది తలకెక్కదు.

ఒరే బండరాయా
చెప్పిచెప్పి, నోరెండిపోతున్నాది కదారా
వున్నదున్నట్టే  చెప్పేటోడికేం వుంటాదిరా, విలువ.

మసాలాలు లేకుండా చికెనీలు
సెంటిమెంట్ పండకుండా కవిత్వాలు

కళ్లు మండకుండా తలస్నానమెందిరా, భయ్.

1 July 2014

పరామీటర్స్


తేలిపోతున్న మేఘాలు
మోసుకెళ్తున్న సందేశాలను
చెవులి రిక్కించి వింటూ,
కురిస్తున్నచివరి చినుకుల
తుంపర్లతో తడుస్తున్న దేహంతో
అప్పుడిక కవి
అరమోడ్పు కన్నులతో
ఇలా మొదలెడతాడు

అస్పష్టంగా నీలో కొన్ని
నదులు ప్రవహించాలి.
కొన్ని పూలు వికసించాలి
కొన్ని చెట్లు చిగురించాలి
ప్రవహిస్తున్న భావాల ఉరవడికి
అడ్డుకట్టలు కట్టుకోవాలి
ఎప్పుడు ఎంతెంత వదలాలో ఉద్వేగాన్ని
ఆ లెక్కలు నీకు తెలిసుండాలి.

శోభనిచ్చే పూలను
ఆచితూచి ఎంచుకోవాలి.
ఒకానొక అలౌకికత్వంతో
పదమాలలు అల్లుకోవాలి.
సమయ సందర్భాలను చూసి
ఇదే నా కవిత్వమని చాటుకోవాలి
అంటూ చిన్నగా నవ్వాడు కవి.

ఈలోపు లోపలున్న అకృత్యుడు బయటకొచ్చాడు,
నేనూ చెబుతాను కవిత్వం గురించి కొన్ని మాటలంటూ,.

గొంతులో అడ్డం పడ్డ ఖఫాన్ని
ఖాండ్రించి బలంగా ఉమ్మడమూ కాదు.

అజీర్ణమైన భావాన్ని
చెవులు మూసుకుని
బలవంతంగా కక్కడమూ కాదు.,

గొంతు కూర్చొని రానిదాన్ని
గట్టిగా ముక్కడమూ కాదు,.కవిత్వమంటే,.
అంటూ పడిపడి నవ్వాడు వాడు.
ఇప్పుడు నువ్వు రాస్తున్నదదే కదా అంటూ,.



H R K గారితో ఓ చిన్న సంభాషణ




30 June 2014

గమ్యం



అన్నీ వున్న చోట కూడా
ఆరాట పడుతున్నావంటే,
ఏమీ లేని చోటుకు
నువ్వు పయనిస్తున్నవని అర్థం
అని నేను అంటున్నప్పుడు

నువ్వంటావు, వగరుస్తూ

నా దృష్టిలో
నువ్వునుకున్న అన్నీ
చాలా స్వల్పమైనవని
లేదా నేనుకున్న వాటిలో ఓ చిన్న భాగమని.
ఆ విషయం నీకెందకు అర్థం కాదని.

అక్బర్ సమాధి గురించి కొన్ని విషయాలు.


ఆగ్రా లోని సికింద్రాలో వున్న అక్భర్ సమాధి గురించిన కొన్ని విషయాలు చూస్తూ, విందామా,.


28 June 2014

కమురు నేల



ఎక్కడో ఒకడు కాలిపోతాడు,
కాసేపు దుఃఖించి, కొద్ది కన్నీరు కార్చావా?
ఇక నీకు మానవత్వం వున్నట్లే.

విశ్లేషించుకుని సంఘటనను
కొన్నికారణాల మీద నిలబడి
ఎవడెవడినో తిట్టి,  కాస్త నోటి దూల తీర్చుకున్నావా?
ఇక నీకు కాస్త,. సామాజిక చైతన్యం వున్నట్లే.

టి ఆర్ పి రేటింగ్ లను లెక్కలేసుకొని
కాలిపోయిన దేహాల మీద
విషాద సంగీతాన్ని ఒలకపోసి ,
ఇంకాస్తా ఆకర్షించావా ఎవరినైనా.
అయితే నీలో ఒక  మీడియా మొఘల్ నిద్రలేచినట్లే.

చచ్చిన శవాల లెక్కల్లో, వాటి పరామర్శల్లో
అదే పనిగా ఓ రెండు రోజులు తిరిగి
నోటి నిండా విషాదాని, ఎక్స్గ్రేషియా సంచుల ఆశల్ని
అక్కడికక్కడే విసిరి పారేసావా, గజనీవై
నీలో ఓ రాజకీయనాయకుడు అవతరించినట్లే.

ఇంకేమీ చేయలేక, ఓ నాలుగు అక్షరాలు రాసి
నువ్వూ ఒక కవిత రాల్చేసుకుంటే
ఇంకేం పర్లేదు, ఒక కవిగా నువ్వు నిలబడ్డట్లే.

రేపొక ప్రభుత్వ సంస్థ
ఆయిల్ బావులో, సహజవాయువులో
రిలయన్స్ పరం కావాడాన్ని
నువ్విప్పుడే  ఈ దృశ్యాల నుంచే కలగంటే
నీకు ఖచ్చితంగా మూర్ఖత్వం నెత్తికెక్కినట్లే.



22 April 2014

ద గ్రేట్ స్టుపిడిటి



నా కిప్పుడు జనం కావాలి.

పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.

రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా  కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు.

పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.

రెండు కాగితాలకు,  ఓ క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,

నాకిప్పుడు జనం కావాలి.

మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.

నాకిప్పుడు జనం కావాలి.

కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,

బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.

నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.

2
ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి.
ఎంత మంది దొరకచ్చిక్కడ?