Pages

19 August 2017

కన్యాశుల్కం (సంక్షిప్తం) - 1 - మృత్యుంజయరావు పిన్నమనేనిప్రథమాంకము
మ.రా.శ్రీ. యన్. గిరీశం టక్కరి. మోసకారి. ఏ డిగ్రీలూ లేకపోయినా బొట్లేరు ఇంగ్లీషు ముక్కలతో బాగా చదువుకున్నవాడి లాగా అందరినీ వాక్చాతుర్యంతో మభ్యపెట్టగలడు. విజయనగరంలోని ఒక పూటకూళ్ళ వితంతువును ఉంచుకొని ఆమె ఇంట్లో చేరి అరవచాకిరీ చేస్తుంటాడు. కాదు, పూటకూళ్ళమ్మే అతన్నుంచుకొని వేళ కింత గంజి బోస్తుందని కొందరంటారు. సంతలో సామాను కొనిపెడతానని అబద్ధం చెప్పి పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు లాగేశాడు. నిజం తెలిసిన పూటకూళ్ళమ్మ అతగాడు దొరికితే చావగొట్టే ఆలోచనలో ఉంది. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఆమె తాలూకువాళ్ళు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేసేలా ఉన్నారు. ఊళ్ళో దొరికిన ప్రతివాడి దగ్గరా అప్పులు చేసి ఉండటంతో వాళ్ళూ దొరికితే తన్నేలా ఉన్నారు. మరో చోటికి వెడితే తిండికి జరిగేదెలాగా అని ఆలోచిస్తున్న గిరీశానికి కృష్ణరాయపురం అగ్రహారం నుంచి వచ్చి విజయనగరంలో చదువు కుంటున్న వెంకటేశం అనే కుర్రాడు అప్పనంగా దొరికాడు. ఆ పిల్లవాడు పరీక్ష తప్పి, ఇంట్లో తెలిస్తే తండ్రి తంతాడేమోననే భయంలో ఉన్నాడు. గిరీశం వాడికి ధైర్యం చెప్పి వాడితో కలిసి చదువు చెప్పే మిష మీద వాడి వూరికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. వేకువనే బయల్దేరేందుకు వీలుగా బండి సిద్ధం చెయ్యమని చెప్పి ఆ రాత్రికి తానుంచుకున్న వేశ్యని చూసేందుకు ఆమె ఇంటికి బయల్దేరాడు.
మధురవాణి విజయనగరంలో పేరెన్నికగన్న వేశ్య. డిప్టీకలెక్టరుగారబ్బాయిని ఆకట్టుకోవడంతో ఆయన మండిపడి కొడుకుని పైచదువుల మిషతో ఊరికి పంపి ఈమె మీద నిఘా ఉంచాడు. దాంతో పెద్దమనిషనే వాడెవడూ మధురవాణి గుమ్మం తొక్కేందుకు సాహసించలేదు. ప్రస్తుతానికి గిరీశం ఆడాలో వుంది కానీ, డబ్బుకు కటకటగా ఉంది. ఈ గోలనుంచి తప్పుకొని కొన్నాళ్ళపాటు వేరే ఊరిలో తలదాచుకోవాలనుకుంటున్న మధురవాణికి రామచంద్రాపురం అగ్రహారంలో నివసించే రామప్పంతులు తారసపడ్డాడు. అతనితో ఉండటానికి నెలజీతం మీద బేరం కుదుర్చుకుంది. గిరీశానికి ఒక్క మాట చెప్పి అతనితో తెగదెంపులు చేసుకోవడమే ఇక మిగిలి ఉంది.

గిరీశం చిన్నప్పటినుండీ రామప్పంతులుకి తెలుసు. రామచంద్రాపురంలో ఉండే లుబ్దావధాని పినతల్లి కొడుకే గిరీశం. లుబ్దావధాని విధవ కూతురుతో రామప్పంతులికి చీకటి సంబంధం ఉంది. ఆ చనువుతో గిరీశం గురించి మధురవాణి దగ్గర తేలిక మాటలు మాట్లాడాడు రామప్పంతులు. సరిగ్గా అదే సమయానికి గిరీశం అక్కడికి వచ్చాడు. అతడు రావడం చూసి పంతులు భయంతో మంచం కింద దాక్కున్నాడు. గిరీశం మధురవాణితో సరససల్లాపాలు మొదలెట్టాడు. అంతలో అతణ్ణి వెదుక్కుంటూ చీపురుకట్ట తీసుకొని పూటకూళ్ళమ్మ అక్కడికి వచ్చింది. ఆమె రావడం చూసి గిరీశం కూడా రామప్పంతులు దూరిన మంచం కిందే దూరాడు. ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నవాళ్ళు కావడంతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. బయట పూటకూళ్ళమ్మ నానా యాగీ చేస్తోంది. మధురవాణి కళ్ళతో సైగ చేసి గిరీశం మంచం కింద ఉన్న సంగతి బయటపెట్టింది. పూటకూళ్ళమ్మ ఆవేశంతో రగులుకుపోతూ చీపురుకట్ట తిరగేసి మంచం కింద బాదింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికే రామప్పంతుల్ని ఇవతలికి లాగి తానవతలి పక్కకి తప్పుకున్నాడు గిరీశం. దాంతో చీపురు దెబ్బ రామప్పంతులుకి తగిలింది. పంతులు కోపంతో బయటికి వచ్చి పూటకూళ్ళమ్మను తిట్టాడు. పూటకూళ్ళమ్మ అతణ్ణి చూసి నిర్ఘాంతపోయింది. ఈ సందట్లో గిరీశం అక్కడినుంచి పారిపోయాడు. అతని వెనకే పూటకూళ్ళమ్మ వెళ్ళిపోయింది. మధురవాణి రామప్పంతుల్ని సముదాయించింది.

No comments:

Post a Comment