Pages

8 October 2013

అర్థంకాని కవిత్వం


         
 ప్రచురణ - ఈ మాట - జూలై 2011 సంచికలోని వ్యాసం 


రచన - భైరవభట్ల కామేశ్వరరావు గారు,,.  
 The writer invites us to understand his language, not to translate it into the language of our equivalencies. 
- Nicolás Gómez Dávila

గోమెజ్ దవీలా వాక్యోక్తులలో(aphorisms) నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వాక్యోక్తి యిది. రచనల్లోకవిత్వానికీ, అందులోను ఆధునిక కవిత్వానికి ఎంతగానో వర్తించే వాక్యమిదని నేననుకుంటాను.
ఇటీవలి కాలంలో వస్తున్న కవిత్వం చాలా వరకూ అర్థం కానిదనీ, కొండొకచో అర్థం లేనిదనీ పాఠకులు విమర్శించడం తరచుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్టులో ప్రచురితమయ్యే కవిత్వం విషయంలో దీన్ని నేను స్పష్టంగా గమనించాను. ఎందుకిలా జరుగుతోంది? ఇది వస్తున్న కవిత్వంలో లోపమా? లేదా చదివే పాఠకుల లోపమా? అని కాస్త నాలో ఆలోచన మొదలయ్యింది. దీని గురించి ఆలోచన మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట ఠక్కున గుర్తుకు వచ్చినది విశ్వనాథవారి యీ పద్యం:
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి, యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడచెన్!
పాత రోజుల్లో ఒక పద్యానికి అర్థం తెలియకపోతే అది పాఠకుని తెలియనితనం. అదే యీ కాలంలో, వ్రాసిన కవిదే తప్పు. ఏమిటో కలికాలం! – అని సుమారు ఒక ఏభయ్యేళ్ళ కిందట వాపోయారాయన! ఇది ముఖ్యంగా ఆ రోజుల్లో పద్యకవిత్వంపై వచ్చిన తీవ్ర నిరసనని దృష్టిలో పెట్టుకొని వ్రాసిన పద్యం. పద్యానికి అర్థం తెలియాలంటే దానికి పాఠకుడు కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పద్యాన్ని ఎలా పదవిభాగం చేసుకోవాలో తెలిసుండాలి. అలా విభాగం చేసుకున్న పదాలకి ఆ సందర్భానికి తగిన అర్థాలు తెలిసుండాలి. ఇవన్నీ కలుపుకొని చదువుకుంటే పద్యం కొంత వరకూ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో మళ్ళీ ఏ శ్లేషో, మరో అలంకారమో, ధ్వనో ఉంటే దాన్ని గుర్తించే నేర్పుండాలి. అలా ఉండి చదివే పాఠకునికే పద్యార్థం పూర్తిగా బోధపడేది. అంటే కావ్యాలలో పద్యాలని అర్థం చేసుకోడానికి పాఠకులకి కూడా ఒక స్థాయి, కొంత అనుభవం అవసరం అన్నమాట.
మరి యిదే అంశం యీ నాటి కవిత్వానికి కూడా వర్తిస్తుందా? – అని ఆలోచిస్తూ ఉంటే, “There is then creative reading as well as creative writing” అన్న ఎమర్సన్ (Ralph W. Emerson) మాట గుర్తుకువచ్చింది. ఈ మధ్యన ప్రముఖ కవి అఫ్సర్ తన బ్లాగులో ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు: కవిత్వం రాయడం కన్నా, కవిత్వం చదవడం గొప్ప కళ అనిపిస్తోంది ఈ మధ్య. అటు ఎమర్సన్ పలుకు, ఇటు అఫ్సర్‌గారి చెణుకు, నా ఆలోచనలని మరింత బలపరిచాయి. కవిత్వం వ్రాయడం లాగానే, చదివి ఆకళించుకొని ఆస్వాదించడం కూడా అంతో ఇంతో సృజనతో కూడుకున్న పనే. దానికి కూడా కొంత పరిశ్రమ, అనుభవము నిస్సందేహంగా అవసరమే. ఇలా అంటే కొంతమంది ‘అభ్యుదయవాదులు’ ఉలిక్కిపడే అవకాశం ఉంది! వారి దృష్టిలో, సామాన్య జనానికి అర్థం కావడమనేది ఆధునిక కవిత్వపు కనీస లక్షణం. అలా కాకుండా ఏదో ఒక వర్గానికి చెందిన పాఠకులకి మాత్రమే కవిత్వం పరిమితమవ్వడం ఫ్యూడల్ ధోరణి అంటారు వాళ్ళు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కవిత్వం ఒకే వర్గానికి చెందిన పాఠకులకి పరిమితమవ్వాలి అని నేను అనలేదు. కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి కొంత పరిశ్రమ అనుభవము అవసరమవుతాయని మాత్రమే నేనంటున్నాను. ఈ రెండిటికి తేడా ఏమిటన్నది అర్థం చేసుకోవాలంటే సాహిత్యచరిత్రని కొద్దిగా తిరగెయ్యాలి.

పూర్తి వ్యాసాన్ని  ఈ లింక్ లో చదవండి


( రచయితకు మరియు ఈ మాట పత్రికా సంపాదకులకు కృతజ్ఞతలతో)

No comments:

Post a Comment