Pages

28 March 2016

bekaareelu 36-45

36
ప్రోలాగ్*
మనుషులెప్పుడూ రెండు వర్గాలే.
వాడుకునే వాళ్లు
వాడబడే వాళ్లు
----------------
టార్గెట్ గ్రూప్లో ఉన్నప్పుడు
ప్రేమలు ప్రకటించబడతాయ్.
అవసరం తీరగానే,
గిరాటేయబడతాయ్.

అందరిని ప్రేమించే వాడు కదా,
వల విసరబడ్డప్పుడు కూడా
చెప్పలేడు,
ఫలాన కారణంతో
వాడ్ని ధ్వేషించు అని.
-----------
ఎపిలోగ్*
వాడుకొని వదిలేసే వాడు
అ కాలానికి
గట్టిగానే వాటేసుకుంటాడు.
010915


37
అతనన్నాడు,
వదిలేస్తే ఒంటరివై ఏడుస్తావ్, అని.

లోపల్లోపలే నవ్వుకుంది.
పంజరపు తోడు లేని
ఒంటరి చిలకను కదూ అప్పుడని.
300815

38
అంగీకరిస్తూ
అడుగులు వేసినంత సులభమేం కాదు.
ఖండిస్తూ ముందుకు కొనసాగడం.

తిప్పలొచ్చినప్పుడు,
తప్పులున్నా తప్పుకుపోయినంత
సులభం కాదు.
తిరస్కరిస్తూ తెగబడి పోరాడటం.

తిరస్కరణను
సహించినంత తేలికేం కాదు
తెగబడి తిరగబడం.
020915
(నోట్ -విపర్యయ సత్యమూ సంభవమే)

39

ఈ కవులున్నారు చూసావు,
మరంత ఎకసెక్కంగా మొదలెట్టిందామె.
దొడ్లో బట్టలను జాడిస్తూ.

వాస్తవంలోకి ఒదగలేరు,
ఊహల్లోకి ఎదగనూ లేరు.

మధ్యన వేలాడే
అటు ఇటు కాని వాళ్లు  కదూ, వీళ్లూ,
అంది ధీర్ఘంగా మెలితిప్పుతూ.

తలెత్తే ధైర్యం లేక,
అక్షరాలను రాల్చుకుంటూ,
ఉతికేసిన చొక్కాలా నేను.
030915

40
రోజూ ఆమె అక్కడే
పిల్లల్ని బస్సెక్కించి,
నవ్వుతూ సాగనంపి,
ఒంటరిగా ఇంటికెళ్తుంది.

ఈరోజే చూసాను.
తను వచ్చేటప్పుడు కూడా
ఒంటరిగా రావడం.

41
ఒకవైపు
అల్లరి చినుకుల సందడి
మరోవైపు
తడవలేని నిస్సహాయత
జ్ఞాపకాలు నెమరేస్తూ,
వణుకుతూ ముసలి గొడుగు.
120915

42

ఆమె అడుగుతుంది,
అక్కడ సంతోషముందా-
దుఃఖముందా అని.

అతనన్నాడు,
ముందుకు నడుస్తూ.

జీవితముందని.

ఏం, ఇక్కడ లేదా
అందామె కటువుగా.

పరిగెత్తుతూ
అన్నాడతను,
ఇక్కడ
నువ్వున్నావుగానని.

43.
అతని మధ్య
దువ్వడం నేర్చుకున్నాడు.

చేతి క్రిందకు
చేరేవారి సంఖ్య పెరిగింది.


44
వింటున్నాను
మతం మాట్లాడుతుంది.
ఇక్కడో ప్రాంతం,
అక్కడో కులం.

మనుషులే
మూగపోయారు.
050915


45
కాలవలు
పారుతున్నాయ్.

చుక్క నీరు లేక
చెంపలపై వెచ్చగా.
070915


No comments:

Post a Comment